- నెలరోజులు రావలసిన బండ రెండు రోజులకే ఖతం
- కంగుతిన్న వరంగల్ క్రాస్ రోడ్డుకు చెందిన ఓ చికెన్ వ్యాపారి
- యుద్ధం నేపథ్యంలో అందిన కాడికి దండుకున్న వైనం
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్ : ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఓ చికెన్ వ్యాపారికి బ్లాక్ గ్యాస్ బండ కొనుగోలు చేసుకుని మోసపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. యుద్ధం నేపథ్యంలో రూ. 3వేలు వెచ్చించి మధ్యవర్తుల ద్వారా కొనుగోలు చేసినందుకు నిలువు దోపిడీకి గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే... వరంగల్ క్రాస్ రోడ్డు కు చెందిన ఓ చికెన్ వ్యాపారి నెల రోజుల క్రితం ఒక గ్యాస్ బండను బ్లాక్‌లో కొనుగోలు చేశాడు. అయితే ఈ బండను రెండు రోజుల నుంచి వినియోగించడం ప్రారంభించాడు. కానీ రెండు రోజులకే గ్యాస్ రావడం బంద్ అయింది. అదేంటి నెల రోజులు రావాల్సిన గ్యాస్ సిలిండర్ రెండు రోజులకే అయిపోయిందా ఏమిటని సిలిండర్ ఎత్తుకొని చూస్తే బరువు గానే ఉంది. మరోసారి ప్రయత్నించినప్పటికీ గ్యాస్ రావడం లేదు. ఇదేమిటని ఊపి చూడగా లిక్విడ్ కదిలిన శబ్దం వినిపించింది. ఈ నేపథ్యంలో గ్యాస్ బండను తిరగల వేసి గ్యాస్ వచ్చే లివర్‌ను నొక్కగా అందులో నుంచి నీరు ధారల కారసాగింది. దీంతో ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఇది ఇండియన్ గ్యాస్ సంస్థకు చెందిన సిలిండర్ గా తెలిసింది. దీంతో తను మోసపోయానని గ్రహించాడు. కాగా అమెరికా ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం మాటున గ్యాస్ నిర్వాహకులు గట్టిగానే కూడా పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి నయా దందాకు పాల్పడుతున్న ముఠాలపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి