మహిళా సాధికారతే సమాజ ప్రగతికి పునాది
మాజీ ఐఏఎస్- లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: యువతలో విలువలతో కూడిన నాయకత్వం, బాధ్యతాయుతమైన పౌరసత్వం పెంపొందితేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని పదవీ విరమణ పొందిన ఐఏఎస్ అధికారి, లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ అన్నారు. మహిళలకు విద్య, ఆర్థిక స్వావలంబన, సమాన అవకాశాలు కల్పించినప్పుడే సమాజం సమగ్ర అభివృద్ధి సాధిస్తుందని ఆయన స్పష్టం చేశారు.ప్రియదర్శిని మహిళా ఇంజినీరింగ్ ఆటోనామస్ కళాశాలలో "యువ నాయకత్వం – మహిళా సాధికారత ద్వారా సమాజ పరివర్తన" అంశంపై నిర్వహించిన ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థినులను ఉద్దేశించి ప్రసంగించారు.జయప్రకాశ్ నారాయణ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, విద్యార్థులు కేవలం డిగ్రీలు సాధించడం మాత్రమే కాకుండా నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, ప్రజాస్వామ్య స్ఫూర్తిని అలవరచుకోవాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత కాలంలో సమస్యలను విశ్లేషించే సామర్థ్యం, విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకత, ప్రజాసేవా దృక్పథం యువతకు అత్యంత అవసరమని చెప్పారు.మహిళా సాధికారతపై ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన, మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తేనే కుటుంబం, సమాజం, దేశం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ప్రతి రంగంలో మహిళలు తమ ప్రతిభను చాటుకుంటున్నారని, వారిని ప్రోత్సహించడం కుటుంబాలు, విద్యాసంస్థలు, సమాజం అందరి బాధ్యత అని అన్నారు.అవినీతి రహిత పాలన, పారదర్శకత, చట్టాల పట్ల గౌరవం, ప్రజాస్వామ్య విలువలను ప్రతి పౌరుడు తన జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చిన ఆయన, "మార్పు కోసం ఇతరులను ఎదురు చూడకుండా ప్రతి వ్యక్తి తనలోనే మార్పును ప్రారంభిస్తే సమాజంలో సానుకూల పరివర్తన సాధ్యమవుతుంది" అని పేర్కొన్నారు. యువత తమ ప్రతిభను వ్యక్తిగత విజయాలకే పరిమితం చేయకుండా సమాజ అభ్యున్నతికి వినియోగించాలని సూచించారు.అనంతరం నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్లో విద్యార్థినులు నాయకత్వం, పరిపాలన, ఉపాధి అవకాశాలు, ఉన్నత విద్య, మహిళా సాధికారత, ప్రజాస్వామ్యం, సామాజిక బాధ్యత వంటి అంశాలపై అడిగిన ప్రశ్నలకు జయప్రకాశ్ నారాయణ తన అనుభవాలతో కూడిన సమగ్ర సమాధానాలు అందించి వారికి మార్గనిర్దేశనం చేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కటేపల్లి నవీన్ బాబు, ప్రిన్సిపాల్ డా. బత్తుల గోపాల్, డైరెక్టర్ అట్లూరి వెంకటరమణ, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది, అధిక సంఖ్యలో విద్యార్థినులు పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి