త్వరితగతిన సమీకృత మండల కార్యాలయాల నిర్మాణం పూర్తి చేయాలి
తరుణీహాట్లో పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్
ప్రజాపక్షం / ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండల సమీకృత కార్యాలయాల సముదాయం నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అధికారులను ఆదేశించారు.మంగళవారం ఏదిలాపురం మున్సిపాలిటీ లోనే 30వ వార్డులోని తరుణీహాట్లో నిర్మాణంలో ఉన్న జీ+2 సమీకృత మండల కార్యాలయాల సముదాయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. భవన నిర్మాణ నాణ్యత, గదుల కేటాయింపు, పనుల పురోగతిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి జాప్యం లేకుండా నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు.జిల్లాలో తొలి సమీకృత మండల కార్యాలయాల సముదాయం కావడంతో పనులను నాణ్యతతో పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సముదాయంలో ఎదులాపురం మున్సిపాలిటీ, రెవెన్యూ, పంచాయతీరాజ్, వ్యవసాయ, ఉద్యానవన, విద్యుత్, విద్యాశాఖ, మహిళా-శిశు సంక్షేమం, రిజిస్ట్రేషన్, ఆర్&బీ, నీటిపారుదల, మిషన్ భగీరథ, సబ్-రిజిస్ట్రార్ తదితర శాఖల కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఏర్పాటు కానున్నాయి.ప్రజలు వివిధ ప్రభుత్వ కార్యాలయాల కోసం వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఒకేచోట సేవలు పొందే అవకాశం కలుగుతుందని కలెక్టర్ తెలిపారు. భవనంలో విశాలమైన సమావేశ మందిరాలు, ఆధునిక కార్యాలయ గదులు, వేచిచూడే హాల్స్, పార్కింగ్, తాగునీరు, మరుగుదొడ్లు, దివ్యాంగులకు అనుకూల ర్యాంపులు, లిఫ్ట్ తదితర సౌకర్యాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.అన్ని శాఖలు ఒకే ప్రాంగణంలో పనిచేయడం వల్ల అధికారుల మధ్య సమన్వయం మెరుగుపడి, ఫైళ్ల పరిష్కారం వేగవంతం కావడంతో పాటు ప్రజలకు పారదర్శకమైన, సమర్థవంతమైన సేవలు అందుబాటులోకి వస్తాయని కలెక్టర్ దివాకర్ టీఎస్ తెలిపారు.ఈ తనిఖీలో ఖమ్మం రూరల్ తహసీల్దార్ వినయేందర్ రెడ్డి, ఆర్&బీ శాఖ అధికారులు, సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి