ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

కాల్వను మింగి... కట్టను కూల్చి...



 మంగళగూడెంలో చెరువుపై కబ్జాదారుల కన్ను
పాండవులకుంట ఉనికికే ముప్పు.. ఆందోళనలో రైతులు
అక్రమ బ్లాస్టింగ్‌తో బెంబేలెత్తుతున్న గ్రామస్తులు

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం గ్రామంలోని పాండవులకుంట చెరువు క్రమంగా ఆక్రమణ కోరల్లో చిక్కుకుంటోంది. చెరువుకు నీరు చేరే కాల్వను ఆక్రమిస్తూ, చెరువు కట్టను సైతం తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో గ్రామంలో తీవ్ర ఆందోళన నెలకొంది.ఆక్రమణలో భాగంగా చెరువు పరిసర ప్రాంతాల్లో భారీ బండరాళ్లను బ్లాస్టింగ్ ద్వారా తొలగిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. బ్లాస్టింగ్ కారణంగా పెద్ద శబ్దాలు వినిపిస్తూ సమీపంలోని ఇళ్లలో ప్రకంపనలు ఏర్పడుతున్నాయని, చిన్నారులు, మహిళలు, వృద్ధులు భయాందోళనకు గురవుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దశాబ్దాలుగా గ్రామ రైతులకు సాగునీటి ఆధారంగా ఉన్న ఈ చెరువు ఆక్రమణలతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోవడంతో పాటు, భవిష్యత్తులో పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువు కట్ట దెబ్బతింటే వర్షాకాలంలో నీటి నిల్వ దెబ్బతినడమే కాకుండా పరిసర ప్రాంతాలపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.గతంలో చెరువులు, కాల్వలను పరిరక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టినప్పటికీ, ఇలాంటి ఆక్రమణలు కొనసాగడం అధికారుల పర్యవేక్షణ లోపాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తోందని స్థానికులు విమర్శిస్తున్నారు.తక్షణమే రెవెన్యూ, ఇరిగేషన్, గనుల శాఖ అధికారులు సంయుక్తంగా విచారణ చేపట్టి చెరువు సరిహద్దులను గుర్తించి, అక్రమ ఆక్రమణలు, బ్లాస్టింగ్‌ను అడ్డుకొని పాండవులకుంట చెరువును రక్షించాలని రైతులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది