యూనియన్లకు అతీతంగా మద్దతు పలకాలని విజ్ఞప్తి
ఈ నెల 22 నుంచి సుబ్లేడ్ నుండి ప్రారంభం..
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్ : జర్నలిస్టుల సొంతింటి కలను సాకారం చేయాలనే డిమాండ్‌తో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్–హెచ్ 2843) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి పాదయాత్ర చేపట్టనున్నట్లు సంఘ నియోజకవర్గ నాయకులు యాస లక్ష్మారెడ్డి, ఎన్ డీ కర్ణ ,పెండ్ర అంజయ్య లు తెలిపారు. గురువారం తిరుమలాయపాలెం మండల కేంద్రంలో జిల్లా కమిటీ ఆదేశానుసారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు పాదయాత్ర వివరాలను వెల్లడించారు. నైజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి అమరుడైన జర్నలిస్టు షోయబుల్లాఖాన్ వర్ధంతి రోజున ఆయన స్వస్థలం తిరుమలాయపాలెం మండలం సుబ్లేడ్ గ్రామంలోని విగ్రహం వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. తొలిరోజు సుబ్లేడ్ నుంచి తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి, ఖమ్మం రూరల్, ఏదులాపురం మున్సిపాలిటీ కేంద్రాల వరకు యాత్ర కొనసాగుతుందని చెప్పారు. యాత్రలో భాగంగా అన్ని మండల కేంద్రాల్లోని తహశీల్దార్లకు వినతిపత్రాలు అందజేసి జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పరిధిలోని మండల కేంద్రాలను కలుపుతూ సుమారు 15 రోజుల పాటు పాదయాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు. చాలీచాలని వేతనాలు, ఆర్థిక ఇబ్బందులతో అద్దె ఇళ్లలో జీవిస్తున్న జర్నలిస్టులకు సొంతింటి స్థలం కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. గత, ప్రస్తుత ప్రభుత్వాలు జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఈ పాదయాత్ర ఏ రాజకీయ పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. జర్నలిస్టులకు ఇచ్చిన హామీని ప్రభుత్వానికి గుర్తు చేయడంతో పాటు సమస్య పరిష్కారానికి కృషి చేయడమే పాదయాత్ర ఉద్దేశమన్నారు. యాత్రను రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వాలని కోరారు. పాలేరు నియోజకవర్గ నాయకులు యాస లక్ష్మారెడ్డి, ఎన్డీ కర్ణకుమార్లు...మాట్లాడుతూ జర్నలిస్టుల సొంతింటి కలను నెరవేర్చేందుకు చేపడుతున్న పాదయాత్రకు సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. జర్నలిస్టుల సమస్యను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. జర్నలిస్టులంతా యూనియన్లకు అతీతంగా పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వృత్తి బాధ్యతలను నిర్వర్తిస్తూనే పాదయాత్ర కొనసాగించాల్సి ఉన్నందున పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన విరామాలతో యాత్రను ముందుకు తీసుకెళ్తామని టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో టీడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ నాయకులు నాగరాజు, భూక్య రాజేష్, కామల్ల వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి