ప్రజా పక్షం/ముదిగొండ: వంట నూనెల్లో కల్తీకి పాల్పడుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ముదిగొండ మండలం వెంకటాపురం గ్రామంలోని ఓ ఇంట్లో పశువుల కొవ్వు, వ్యర్థాలతో వంట నూనెను కల్తీ చేస్తున్నట్లు గ్రామస్థులు గుర్తించారు. సమాచారం మేరకు గ్రామస్థులు అక్కడికి చేరుకుని కల్తీ తయారీని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించి, అక్కడ ఉన్న నూనె డబ్బాలతో పాటు పశువుల మాంసాన్ని స్వాధీనం చేసుకుని ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించినట్లు తెలిసింది. పశువుల వ్యర్థాలు, ఎముకలు, కొవ్వును తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని మరిగించి, వివిధ రకాల ప్రక్రియల ద్వారా నూనెగా తయారు చేస్తున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ నూనెను ఎక్కడికి తరలిస్తున్నారు? ఎవరికి విక్రయిస్తున్నారు? ఎంతకాలంగా ఈ వ్యవహారం కొనసాగుతోంది? అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేయాల్సి ఉంది. కాగా, ఇలాంటి కల్తీ నూనెలు మార్కెట్లోకి చేరితే ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. పూర్తి వివరాలు అధికారుల విచారణ అనంతరం వెల్లడికావాల్సి ఉంది.
జంతువుల కొవ్వుతో వంట నూనె తయారీ..!
byThe News Desk
-
0


కామెంట్‌ను పోస్ట్ చేయండి