ప్రియుడికి భార్య పంపినట్లు ఆరోపిస్తున్న వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సందేశాలు
ప్రాణహాని ఉందంటూ పోలీసులకు బాధిత భర్త
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్తను హత్య చేయాలని ప్రియుడితో కలిసి కుట్ర పన్నారంటూ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. తన భార్య, ఆమెతో సంబంధం ఉన్న వ్యక్తి తనను హత్య చేయాలని ప్రణాళిక రచించారని ఆరోపిస్తూ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామానికి చెందిన గాదే రాజేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.బాధితుడి కథనం ప్రకారం, సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన భవానితో 2016లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తాను ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తుండగా, నివాసం మాత్రం ఏదులాపురం మున్సిపాలిటీలోని సాయి గణేష్ నగర్ లో ఉంటున్నాడు. ఈ క్రమంలో భార్యకు కొరియర్ బాయ్ సైదులుతో వివాహేతర సంబంధం ఏర్పడిందని ఆరోపించారు.గత నెల 27న మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వెళ్లగా, తన భార్య మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడాన్ని చూసి అనుమానం నిజమైందని పేర్కొన్నారు. మరుసటి రోజు పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించిన అనంతరం తన అన్నను తీసుకురావడానికి వెళ్తుండగా సైదులు తనను వెంబడించాడని ఆరోపించారు. అక్కడి నుంచి తప్పించుకుని ఇంటికి చేరిన అనంతరం భార్య మొబైల్ ఫోన్‌ను పరిశీలించగా, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో తనను ఎలాగైనా చంపాలని, ఇంట్లో కాకుండా బయట ప్రమాదంలా కనిపించేలా యాక్సిడెంట్ చేయించాలని, లేదంటే తాను చనిపోతానంటూ ప్రియుడికి పంపినట్లు ఆరోపిస్తున్న సందేశాలు కనిపించాయని తెలిపారు.ఆ చాటింగ్ స్క్రీన్షాట్లను సేకరించి ఈ నెల 1న డోర్నకల్ పోలీస్ స్టేషన్లో భార్య, ఆమెతో సంబంధం ఉన్న వ్యక్తిపై ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు.పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ విషయమై ఖమ్మం రూరల్ పోలీసులను వివరణ కోరగా, ఫిర్యాదు సీపీ కార్యాలయం ద్వారా తమకు ఎండార్స్ అవుతుందని, కేసు స్వభావాన్ని బట్టి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతోందని తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి