ఆన్‌లైన్‌లోనే ఇంటి నంబర్ల కేటాయింపు
ప్రజలు ఈ సేవను వినియోగించుకోవాలి: మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్ : ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, సులభమైన పౌర సేవలను అందించాలనే లక్ష్యంతో ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఇంటి నంబర్ల (హౌస్ నంబర్) కేటాయింపు ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో అమలు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా నిర్మించిన గృహాలు, ఇప్పటివరకు ఇంటి నంబర్ లేని భవనాలు, అలాగే భవన విభజన జరిగిన ఇళ్ల యజమానులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తుతో సమర్పించిన పత్రాలను పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ నిర్వహించి, నిబంధనలకు అనుగుణంగా ఇంటి నంబర్ కేటాయిస్తారని తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, భవన నిర్మాణ అనుమతి పత్రం, ఈసీ (EC), లింక్ డాక్యుమెంట్లు, ఆధార్ కార్డు, ఇంటి పక్కన ఉన్న ఇళ్ల నంబర్ల వివరాలు, జీపీఎస్ కెమెరాతో తీసిన భవనం ఫోటోలను తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ విధానం ద్వారా దరఖాస్తుల పరిష్కారం వేగవంతం కావడంతో పాటు పారదర్శకత పెరుగుతుందని, కార్యాలయాలకు పలుమార్లు రావాల్సిన అవసరం తగ్గుతుందని కమిషనర్ తెలిపారు. ఇంటి నంబర్ పొందడం ద్వారా ఆస్తి పన్ను నమోదు, తాగునీటి, డ్రైనేజీ, విద్యుత్ కనెక్షన్లు, పోస్టల్ సేవలు, బ్యాంకింగ్ సేవలు, వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను సులభంగా పొందవచ్చని వివరించారు. అర్హులైన గృహ యజమానులందరూ ఈ ఆన్‌లైన్ సేవను సద్వినియోగం చేసుకుని తమ ఇళ్లకు అధికారిక ఇంటి నంబర్ పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాల కోసం మున్సిపల్ కార్యాలయం, సంబంధిత వార్డు కార్యదర్శి లేదా మున్సిపల్ హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించాలని సూచించారు.
"ప్రజలకు వేగవంతమైన సేవలు – పారదర్శక పరిపాలనే మా లక్ష్యం" అని కమిషనర్ పేర్కొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి