ఆకట్టుకున్న విద్యార్థినుల నృత్యాలు, పాటల ప్రదర్శనలు
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్ : ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లు పంచాయతీ పరిధిలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో సాంస్కృతిక ఉత్సవం శ్రీచైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఆడిటోరియంలో ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. విద్యార్థుల్లో పోటీ పరీక్షల ఒత్తిడిని అధిగమించే మానసిక స్థైర్యంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.కార్యక్రమానికి విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ ముఖ్య అతిథిగా, డైరెక్టర్ మల్లెంపాటి శ్రీవిద్య విశిష్ట అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ మాట్లాడుతూ కేవలం 135 మంది విద్యార్థులతో ప్రారంభమైన శ్రీ చైతన్య జూనియర్ కళాశాల నేడు శాఖోపశాఖలుగా విస్తరించిందన్నారు. విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కార్యక్రమం ఉద్దేశమన్నారు. శ్రీధర్ వీరమల్ల మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తనదైన ప్రత్యేకతను గుర్తించుకోవాలని, ఇతరులతో తమను పోల్చుకోకుండా తమపై తాము నమ్మకం పెంచుకోవాలని సూచించారు. క్రమశిక్షణ, ప్రణాళికాబద్ధమైన దినచర్యతో లక్ష్యాలను సాధించవచ్చన్నారు. అనంతరం విద్యార్థినులు ప్రదర్శించిన నృత్యాలు, పాటలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, మనోవిశ్లేషకుడు శ్రీధర్ వీరమల్ల, ఎడ్యుకేటర్, విజనరీ, ఫిలాంత్రపిస్ట్ చావా సత్యనారాయణ ప్రసాద్, ఎస్‌సీఐటీ ఎగ్జిక్యూటివ్ డీన్ డాక్టర్ సుదర్శన్, కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి