బిల్లులు నిలిపివేస్తా.. అధికారులను సస్పెండ్ చేస్తా
ఇంటిగ్రేటెడ్ భవన నిర్మాణ పనుల్లో నాణ్యతపై తీవ్ర అసంతృప్తి
మరోసారి తనిఖీకి వస్తా.. అప్పటిలోపు నాణ్యతతో నిర్మాణం పూర్తి చేయాల్సిందే
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: నిర్మాణ పనుల్లో నాణ్యత లోపిస్తే బాధ్యులపై చర్యలు తప్పవని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆర్అండ్బీ అధికారులను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ప్రభుత్వ నిధులతో చేపడుతున్న పనుల్లో నాణ్యతా ప్రమాణాలను విస్మరిస్తే సంబంధిత కాంట్రాక్టర్ల బిల్లులను నిలిపివేయడంతో పాటు బ్లాక్‌లిస్టులో పెడతామని, విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై సస్పెన్షన్ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డులోని తరుణిహాట్లో నిర్మితమవుతున్న ఇంటిగ్రేటెడ్ భవన నిర్మాణ సముదాయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన నాణ్యతా ప్రమాణాల్లో లోపాలను గుర్తించి ఆర్అండ్బీ అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణ పనులను పర్యవేక్షించాల్సిన అధికారులు నాణ్యత విషయంలో నిర్లక్ష్యం వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇకపై ఇలాంటి లోపాలు పునరావృతం కాకూడదని స్పష్టం చేశారు. నిబంధనలకు అనుగుణంగా, నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలతోనే పనులు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. నాణ్యత లేని పనులకు ప్రభుత్వ నిధుల నుంచి బిల్లులు చెల్లించే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ, నిబంధనలు ఉల్లంఘించిన కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అదే విధంగా పనులను సక్రమంగా పర్యవేక్షించడంలో విఫలమయ్యే అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ భవన నిర్మాణంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. తాను మరోసారి స్వయంగా వచ్చి నిర్మాణ పనులను పరిశీలిస్తానని, అప్పటిలోపు పూర్తి నాణ్యతా ప్రమాణాలతో స్ట్రక్చర్ నిర్మాణం జరగాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తదుపరి తనిఖీలోనూ నాణ్యతా లోపాలు కనిపిస్తే బాధ్యులపై చర్యలు తప్పవనే సంకేతాన్ని మంత్రి అధికారులకు ఇచ్చారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి