ప్రధానోపాధ్యాయుడికి సమాచారం లేకుండానే ఘటన.. గ్రామస్తుల ఫిర్యాదుతో రంగంలోకి ఫారెస్ట్ అధికారులు
సర్పంచ్ భర్త జెర్పుల శ్రీనుపై కేసు నమోదు.. రూ.60 వేల విలువైన కలప స్వాధీనం
ప్రజాపక్షం/కూసుమంచి: మండలంలోని ఎర్రగడ్డ తండా పాఠశాల ఆవరణలో అనుమతులు లేకుండా టేకు చెట్లను నరికివేసిన ఘటన కలకలం రేపింది. ఆగస్టు 26న జనరల్ హాలిడే సందర్భంగా పాఠశాలకు సెలవు ఉన్న సమయంలో స్థానిక ప్రధానోపాధ్యాయుడికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పాఠశాల ప్రాంగణంలోని టేకు చెట్లను నరికివేసినట్లు గ్రామస్తులు ఆరోపించారు. పాఠశాల ఆవరణలోని చెట్లను నరికివేస్తున్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. డీఎఫ్‌ఓకు ఫిర్యాదు చేయడంతో అటవీ శాఖ అధికారులు స్పందించి ఘటనపై విచారణ చేపట్టారు.
ప్రాథమిక పంచనామా.. కలప స్వాధీనం
అటవీ శాఖ ఎఫ్ఆర్ఓ టి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రాథమిక పంచనామా నిర్వహించినట్లు తెలిపారు. నరికివేసిన టేకు చెట్ల కలపను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న కలప విలువ సుమారు రూ.60 వేలుగా అధికారులు గుర్తించినట్లు సమాచారం.
సర్పంచ్ భర్తపై కేసు నమోదు...
చెట్ల నరికివేతకు సంబంధించి ఎర్రగడ్డ తండా గ్రామ సర్పంచ్ భర్త జెర్పుల శ్రీనుపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఆర్ఓ టి. శ్రీనివాస్, డీఆర్ఓ రామారావు తెలిపారు. అటవీ శాఖ నిబంధనలకు విరుద్ధంగా చెట్ల నరికివేత జరిగిందా? చెట్ల నరికివేతకు ఎవరి అనుమతి ఉంది? పాఠశాల ఆవరణలో చెట్లను నరికివేయాల్సిన అవసరం ఏమిటి? అనే అంశాలపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
పాఠశాల ఆస్తుల పరిరక్షణపై ప్రశ్నలు...
ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఉన్న చెట్లు కూడా ప్రభుత్వ ఆస్తుల్లో భాగమేనని, వాటిని నరికివేయాలంటే సంబంధిత శాఖల అనుమతులు, నిబంధనలు పాటించాల్సి ఉంటుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ప్రధానోపాధ్యాయుడికి సమాచారం లేకుండా సెలవు రోజున చెట్ల నరికివేత జరగడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ప్రాంగణంలోని చెట్ల నరికివేతపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా అటవీ అధికారులు నమోదు చేసిన కేసు దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి