ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

రూ.265 ఖర్చుతో తాగునీటి వృథాకు అడ్డుకట్ట!



మిషన్ భగీరథ ట్యాంకు పైపు పగిలి 20 రోజులుగా వృథాగా పోతున్న నీరు.. స్వయంగా మరమ్మతులు చేయించిన 31వ వార్డు కౌన్సిలర్ ఊరడి హైమావతి సుదర్శన్ రెడ్డి


ఎల్నీనో నేపథ్యంలో ఆదర్శంగా నిలిచిన చిన్న చొరవ


ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 31వ వార్డులో మిషన్ భగీరథ తాగునీటి ట్యాంకుకు సంబంధించిన పైపు పగిలి సుమారు 20 రోజులుగా నీరు వృథాగా పోతున్నా మరమ్మతులు చేపట్టకపోవడంపై అధికారుల నిర్లక్ష్య వైఖరికి అద్దం పట్టింది. ఈ నేపథ్యంలో కేవలం రూ.265 విలువైన సామగ్రితో సమస్యను పరిష్కరించే అవకాశం ఉన్నప్పటికీ, సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లు స్పందించకపోవడంతో చివరకు 31వ వార్డు కౌన్సిలర్ ఊరడి హైమావతి సుదర్శన్ రెడ్డి స్వయంగా ఆదివారం చొరవ తీసుకుని మరమ్మతులు చేయించారు. 31వ వార్డులో ఉన్న 120 కిలోలీటర్ల (1,20,000 లీటర్ల) సామర్థ్యం గల మిషన్ భగీరథ ట్యాంకుకు గతంలో రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 9 గంటల వరకు విద్యుత్ మోటారు ద్వారా నీటిని సరఫరా చేసేవారు. అయితే ఎదులాపురం చెరువులో నీటి మట్టం తగ్గిందనే కారణంతో ప్రస్తుతం ఉదయం 4 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే ట్యాంకుకు నీటిని సరఫరా చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో సుమారు 20 రోజుల క్రితం ట్యాంకు ఇన్‌లెట్‌ వద్ద ఉన్న ఎల్బో కనెక్షన్‌కు సంబంధించిన సుమారు ఒకటిన్నర అడుగుల పైపు పగిలిపోయింది. దీంతో ట్యాంకులోకి చేరాల్సిన నీటిలో కొంత భాగం ట్యాంకులోకి వెళ్తుండగా, మిగిలిన నీరు నేలపాలవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే చెరువులో నీటి నిల్వలు తగ్గి సరఫరా సమయం పరిమితమైన పరిస్థితుల్లో ఈ వృథా మరింత ఇబ్బందికరంగా మారింది. విజయదశమి (దసరా) రోజున 31, 32 వార్డుల్లో తాగునీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను గుర్తించిన 31వ వార్డు కౌన్సిలర్ ఊరడి హైమావతి సుదర్శన్ రెడ్డి మిషన్ భగీరథ ఏఈ భాస్కర్‌కు ఫోన్‌ చేసి పరిస్థితిని వివరించారు. అవసరమైన సామగ్రి అందిస్తే కార్మికుడిని పంపిస్తానని ఏఈ చెప్పడంతో, నీటి వృథాను అరికట్టాలనే ఉద్దేశంతో కౌన్సిలర్ వెంటనే స్పందించి సొంతంగా రూ.265 ఖర్చు చేసి అవసరమైన సామగ్రిని సమకూర్చారు. ఆమె స్వయంగా దగ్గరుండి మరమ్మతులు చేయించారు. ప్రజలకు అవసరమైన తాగునీరు వృథా కాకుండా చూడాలనే ఉద్దేశంతో కౌన్సిలర్ తీసుకున్న చొరవపై 31, 32 వార్డుల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు, ప్రజలకు తాగునీరు అందించే కీలకమైన మిషన్ భగీరథ వ్యవస్థలో చిన్నపాటి మరమ్మతులు కూడా సకాలంలో చేపట్టకపోవడంపై స్థానికంగా చర్చ జరుగుతోంది. అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో పనిచేసి నీటి వృథాను అరికట్టడంతో పాటు రెండు వార్డులకు నిరంతరాయంగా తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది