ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

గృహజ్యోతితో పెరిగిన విద్యుత్ వినియోగం.. ఎల్‌నినోతో ఓవర్‌లోడ్ భారం!



 



ఖమ్మం జిల్లాలో రోజుకు 72.82 లక్షల యూనిట్ల డిమాండ్‌.. కోటా 54.4 లక్షల యూనిట్లే


 గత ఏడాదితో పోలిస్తే 30 శాతం పెరిగిన విద్యుత్ లోడ్‌

 రూ.80 లక్షలతో 8 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు

 విద్యుత్ పొదుపుపై ప్రజలకు ఎస్సీ శ్రీనివాస చారి సూచన


ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ప్రభుత్వం అందిస్తున్న గృహజ్యోతి పథకంతో  ఏసీలు, కూలర్లు, వ్యవసాయ మోటార్ల వినియోగం పెరగడంతో జిల్లాలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగిందని విద్యుత్ శాఖ ఎస్సీ శ్రీనివాస చారి తెలిపారు. అలాగే ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే విద్యుత్ వినియోగం పెరిగిందని మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా అందించడంతోపాటు ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్లపై ఓవర్‌లోడ్ భారం తగ్గించేందుకు శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. సోమవారం ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డులో ఉన్న ఖమ్మం రూరల్ విద్యుత్ సబ్‌ డివిజన్ కార్యాలయంలో ఆయన ప్రజాపక్షంతో ప్రత్యేకంగా మాట్లాడారు.


డిమాండ్‌కు.. సరఫరా కోటాకు మధ్య భారీ వ్యత్యాసం


ఖమ్మం జిల్లాలో రోజువారీ విద్యుత్ సరఫరా కోటా 54.4 లక్షల యూనిట్లు ఉండగా, ప్రస్తుతం డిమాండ్ 72.82 లక్షల యూనిట్లకు చేరిందని శ్రీనివాస చారి వివరించారు. ఈ లెక్కన రోజుకు 18.42 లక్షల యూనిట్ల అదనపు అవసరం ఏర్పడుతోందన్నారు. పెరిగిన డిమాండ్‌ను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇతర వనరుల నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తోందని, ఒక్కో యూనిట్‌కు సుమారు రూ.10 వరకు చెల్లించి విద్యుత్‌ను సమకూర్చుకుంటున్నట్లు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే విద్యుత్ లోడ్ సుమారు 30 శాతం పెరిగిందని చెప్పారు. గృహజ్యోతి పథకంతో విద్యుత్ బిల్లుల భారం తగ్గడం, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఏసీల వినియోగం పెరగడం, వ్యవసాయ మోటార్ల వినియోగం అధికమవడం డిమాండ్ పెరుగుదలకు కారణాలుగా పేర్కొన్నారు.


వ్యవసాయ మోటార్లు,ఏసీ లతో ఓవర్‌లోడ్ సమస్యలు


పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి, నర్సింహులగూడెం, కొంగర, అనాసాగరం ప్రాంతాల్లో విద్యుత్ వినియోగం అధికంగా ఉందని ఎస్సీ తెలిపారు. నీటి సౌకర్యం ఎక్కువగా ఉండటంతో వ్యవసాయ మోటార్ల వినియోగం పెరిగిందని, గృహ అవసరాలకూ అధికంగా విద్యుత్ వినియోగిస్తుండటంతో పంపిణీ వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోందన్నారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు ఓవర్‌లోడ్‌కు గురవుతున్నాయని వివరించారు. లోడ్‌ను సమతుల్యం చేయడం, ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేయడం, సబ్‌స్టేషన్లపై ఒత్తిడిని తగ్గించడం ద్వారా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.


రూ.80 లక్షలతో ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు


లోడ్ సమస్యను తగ్గించేందుకు సుమారు రూ.80 లక్షల వ్యయంతో కూసుమంచి, నర్సింహులగూడెంలో 8 ఎంవీఏ సామర్థ్యం గల ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసినట్లు శ్రీనివాస చారి తెలిపారు. అక్కడి నుంచి తొలగించిన 5 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్లను కొంగర వంటి ప్రాంతాల్లో అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేస్తున్నట్లు చెప్పారు. తన పరిధిలో ప్రస్తుతం 320 ట్రాన్స్‌ఫార్మర్లు అందుబాటులో ఉన్నాయని, జిల్లా వ్యాప్తంగా ఎనిమిది ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతు కేంద్రాలు పనిచేస్తున్నాయని వివరించారు. పాలేరు నియోజకవర్గంలోనూ మరమ్మతు కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు, తిరుమలాయపాలెంలో మరో రిపేరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.


ట్రాన్స్‌ఫార్మర్ కోసం రైతులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు


వ్యవసాయ పొలాల్లో ట్రాన్స్‌ఫార్మర్ పాడైతే మరమ్మతులు, తరలింపు, లోడింగ్‌, అన్‌లోడింగ్‌, రవాణా బాధ్యతలను విద్యుత్ శాఖే చూసుకుంటుందని ఎస్సీ స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో రైతులు ఎలాంటి ఖర్చు భరించాల్సిన అవసరం లేదన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ మార్పిడి లేదా మరమ్మతుల పేరుతో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. విద్యుత్ సరఫరా సమస్యలు, మరమ్మతుల్లో జాప్యం వంటి ఇబ్బందులపై 1912 నంబర్‌కు ఫోన్ చేయవచ్చని తెలిపారు. ఖమ్మం జిల్లా కంట్రోల్ రూమ్ 8712483490 నంబర్‌కు కూడా 24 గంటలూ ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.


విద్యుత్ పొదుపు పాటించాలి


ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ఏసీలు, కూలర్లు, ఇతర శీతలీకరణ పరికరాలను అవసరమైన మేరకే వినియోగించాలని శ్రీనివాస చారి సూచించారు. వ్యవసాయ మోటార్ల ద్వారా విద్యుత్ వృథాను అరికట్టాలని, పంటల ఎంపికలో నీటి లభ్యత, స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని సాధ్యమైనంత వరకు ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని రైతులకు సూచించారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు శాఖ కృషి చేస్తోందని, ప్రజలు, రైతులు పొదుపు పాటిస్తే పంపిణీ వ్యవస్థపై ఒత్తిడిని కొంతమేర తగ్గించవచ్చని శ్రీనివాస చారి తెలిపారు.


ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ వినియోగంపై ఒత్తిడి


ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగే పరిస్థితులు విద్యుత్ వినియోగంపై ప్రభావం చూపుతున్నాయని విద్యుత్ శాఖ ఎస్సీ శ్రీనివాస చారి తెలిపారు. ఎండల తీవ్రత పెరిగినప్పుడు ఏసీలు, కూలర్లు, ఇతర శీతలీకరణ పరికరాల వినియోగం అధికమవుతుందని, దీంతో విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంటుందని వివరించారు. ఇప్పటికే గృహజ్యోతి పథకం, వ్యవసాయ మోటార్లు, గృహ అవసరాల కారణంగా పెరిగిన విద్యుత్ వినియోగానికి తోడు వాతావరణ పరిస్థితులు కూడా ప్రభావం చూపుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో గృహ వినియోగదారులు, రైతులు విద్యుత్‌ను అవసరమైన మేరకే వినియోగిస్తూ పొదుపు పాటించాలని సూచించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది