30వ వార్డులో బతుకమ్మలకు బహుమతులు..
ప్రజాపక్షం / ఖమ్మం రూరల్: సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువవుతూ ఆదర్శంగా నిలుస్తున్న దండి భాస్కర్ మెమోరియల్ ట్రస్ట్.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ పండుగలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకుంది. మహిళల్లోని సృజనాత్మకతను ప్రోత్సహిస్తూ, రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలకు బహుమతులు అందించి వారిలో ఉత్సాహాన్ని నింపింది.
ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డులో సద్దుల బతుకమ్మ వేడుకలను స్థానిక సీపీఐ కౌన్సిలర్ దండి శ్రీజ లోకేష్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారి వద్ద మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని, తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. వివిధ రకాల పూలతో తీర్చిదిద్దిన బతుకమ్మలతో ఆ ప్రాంతమంతా పూలవనాన్ని తలపించింది. మహిళల ఆటపాటలు, బతుకమ్మ సంబరాలతో పండుగ వాతావరణం నెలకొంది. ఈ వేడుకల్లో భాగంగా 28వ వార్డు సీపీఐ కౌన్సిలర్ దండి రంగారావు దండి భాస్కర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి, అందంగా అలంకరించిన బతుకమ్మలకు బహుమతులు అందజేశారు. మహిళల భాగస్వామ్యాన్ని అభినందిస్తూ, వారి ప్రతిభకు తగిన ప్రోత్సాహం అందించడం ఈ కార్యక్రమం ప్రత్యేకతగా నిలిచింది. పండుగలు కేవలం సంప్రదాయాలకే పరిమితం కాకుండా మహిళల్లో ఐక్యతను పెంపొందించడంతో పాటు, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించే వేదికలుగా నిలుస్తాయి. ఈ నేపథ్యంలో బతుకమ్మలను ప్రోత్సహిస్తూ దండి భాస్కర్ మెమోరియల్ ట్రస్ట్ చేపట్టిన కార్యక్రమం స్థానిక మహిళల్లో ఆనందాన్ని నింపింది. సామాజిక సేవతో పాటు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు అండగా నిలవడం అభినందనీయమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ కార్యక్రమంలో సాయి బృందావన నగర్ అధ్యక్షులు గుణగంటి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి సురభి సాయి కృష్ణ, గౌరవ అధ్యక్షులు ఆంగోతి శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు తిగుళ్ల శ్రీనివాసరావు, కుందం భద్రారెడ్డి, జంపాల కిరణ్, వెంకటరెడ్డి, శ్రీనివాసచారి, సాంబశివరావు, దిలీప్ , మధు , మహిళా కమిటీ సభ్యులు సంధ్య, స్వప్న, మనీ, అనూష, విజయ తదితరులు పాల్గొన్నారు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి