ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

పెద్దనాన్న ఆనవాయితీకి పదిలంగా కొనసాగింపు.. రామ్‌రెడ్డి వెంకట్‌రెడ్డి బాటలో సర్వోత్తమ్‌రెడ్డి!


 

ఎన్నికల వేళ మద్దులపల్లి ఆంజనేయస్వామి దర్శనం.. వెంకట్‌రెడ్డి పాటించిన సంప్రదాయాన్ని గుర్తుచేసిన సర్వోత్తమ్‌రెడ్డి


ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఆ ఆనవాయితీ వెనుక ఒక జ్ఞాపకం ఉంది.. ఆ ఆలయ దర్శనం వెనుక పెద్దనాన్నతో ముడిపడిన అనుబంధం ఉంది! ఆ ఒరవడినే కొనసాగిస్తూ మాజీ మంత్రి, దివంగత నేత 'రామ్‌రెడ్డి వెంకట్‌రెడ్డి' ఎన్నికల సమయంలో పాటించిన సంప్రదాయాన్ని ఆయన కుటుంబానికి చెందిన రామ్‌రెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి కొనసాగించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అలాగే మద్దులపల్లి ఆంజనేయస్వామి ఆలయంతో వెంకట్‌రెడ్డికి ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తుచేస్తూ సర్వోత్తమ్‌రెడ్డి అదే బాటలో అడుగులు వేశారు.


ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ పట్టభద్రుల నియోజకవర్గ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్తున్న కాంగ్రెస్ ఖమ్మం- నల్గొండ-వరంగల్ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్‌రెడ్డి శనివారం మద్దులపల్లిలోని శివాలయం, ఆంజనేయస్వామి ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో రామ్‌రెడ్డి వెంకట్‌రెడ్డి ప్రతి ఎన్నికల సమయంలో మద్దులపల్లిలోని ఆంజనేయస్వామిని దర్శించుకుని పూజలు చేసిన అనంతరమే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేవారు. ఆంజనేయస్వామి దర్శనంతో ఎన్నికల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ఆయన పాటించిన ఆనవాయితీగా కొనసాగింది.


వెంకట్‌రెడ్డి అడుగుజాడల్లో సర్వోత్తమ్‌రెడ్డి


రామ్‌రెడ్డి వెంకట్‌రెడ్డి భౌతికంగా దూరమైనా.. ఆయన పాటించిన సంప్రదాయాలు, మద్దులపల్లి ఆలయంతో ముడిపడిన జ్ఞాపకాలు మాత్రం కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకు గుర్తుండిపోయాయి. ఇప్పుడు సర్వోత్తమ్‌రెడ్డి అదే ఆలయాలను దర్శించుకుని పూజలు నిర్వహించడం ఆ పాత ఆనవాయితీకి కొనసాగింపుగా నిలిచింది. పెద్దనాన్న పాటించిన సంప్రదాయాన్ని మరువకుండా ఆచరించడం ద్వారా రామ్‌రెడ్డి వెంకట్‌రెడ్డితో తనకున్న కుటుంబ అనుబంధాన్ని, ఆయన వారసత్వం పట్ల గౌరవాన్ని సర్వోత్తమ్‌రెడ్డి చాటుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


మద్దులపల్లి ఆలయాల సాక్షిగా.. ఒక సంప్రదాయానికి కొనసాగింపు!


రాజకీయాల్లో నాయకులు మారినా, కాలం ముందుకు సాగినా.. కొన్ని ఆనవాయితీలు మాత్రం తరతరాలకు గుర్తుగా నిలుస్తాయి. రామ్‌రెడ్డి వెంకట్‌రెడ్డి పాటించిన ఎన్నికల సంప్రదాయాన్ని సర్వోత్తమ్‌రెడ్డి కొనసాగించడం అలాంటి సందర్భంగానే ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఆలయ దర్శనం ద్వారా వెంకట్‌రెడ్డి జ్ఞాపకాలు మరోసారి చర్చకు రావడంతో పాటు, పెద్దలు పాటించిన బాటలో సర్వోత్తమ్‌రెడ్డి అడుగులు వేయడం స్థానికంగా ప్రత్యేక చర్చకు దారితీసింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది