పొన్నెకల్‌లో రూ.200 కోట్ల నిర్మాణ పనులపై మంత్రి పొంగులేటి క్షేత్రస్థాయి పరిశీలన.. అధికారులతో పురోగతిపై సమీక్ష
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పొన్నెకల్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. జూన్ నాటికి పాఠశాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో ఆదివారం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్‌తో కలిసి పొన్నెకల్ వద్ద రూ.200 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న పాఠశాల భవన సముదాయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
నిర్మాణ పనులపై క్షేత్రస్థాయిలో ఆరా
పాఠశాల ప్రాంగణమంతా కలియతిరిగిన మంత్రి పొంగులేటి వివిధ విభాగాల నిర్మాణ పనుల పురోగతిని స్వయంగా పరిశీలించారు. భవన సముదాయానికి సంబంధించిన వివరాలను అధికారులు మ్యాప్‌ల ద్వారా వివరించగా, పనుల ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు. నిర్మాణ నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి, నిర్దేశిత గడువులోగా పనులు పూర్తయ్యేలా అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.
గడువుపై స్పష్టమైన ఆదేశాలు
వచ్చే విద్యా సంవత్సరం జూన్ నాటికి పాఠశాలను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్మాణ పనుల్లో వేగం కొనసాగించాలని మంత్రి స్పష్టం చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పాఠశాల సిద్ధమైతే విద్యార్థులకు అవసరమైన విద్యా, వసతి సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అందుకే నిర్మాణ పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయడంపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యే లక్ష్యం
పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోందని మంత్రి తెలిపారు. నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన వసతి సదుపాయాలను కల్పించడమే ఈ పాఠశాలల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏదులాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి