హెచ్‌ఐవీపై అపోహలు వీడి, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలి
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండల పరిధిలోని అరేకోడు గ్రామంలో వై.ఆర్.జి. కేర్ ఆధ్వర్యంలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వై.ఆర్.జి. కేర్ సూపర్‌వైజర్ కర్లకుంట నరేష్ మాట్లాడుతూ... హెచ్‌ఐవీ సాధారణ స్పర్శ, కలిసి భోజనం చేయడం వంటి రోజువారీ సంపర్కాల ద్వారా వ్యాపించదని తెలిపారు. సురక్షితం కాని లైంగిక సంబంధాలు, కలుషిత రక్తం ఎక్కించడం, కలుషిత సూదులు, సిరంజీలను ఉపయోగించడం, హెచ్‌ఐవీ సోకిన తల్లి నుంచి బిడ్డకు సంక్రమించడం వంటి మార్గాల ద్వారా వైరస్ వ్యాపించే అవకాశం ఉందని వివరించారు. హెచ్‌ఐవీ నివారణకు ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని, అవసరమైన వారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారు వైద్యుల సూచనల మేరకు ఏఆర్‌టీ మందులను క్రమం తప్పకుండా వినియోగిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు. అర్హులైన వారికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలపై కూడా అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. సర్పంచ్ ఆరెంపుల రమాదేవి మాట్లాడుతూ... గ్రామ ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్త నాగమణి, మాజీ సర్పంచ్ ఉప్పుగండ్ల వెంకటనారాయణ, వై.ఆర్.జి. లింక్ వర్కర్ కౌసల్య, మల్లేల వీరయ్య, రామకృష్ణ, పాపారావు, రవి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి