ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

గిరిజన విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యం


 


రూ.2.5 కోట్లతో బాలబాలికల గిరిజన హాస్టళ్ల నిర్మాణం


22వ వార్డులో బాలుర హాస్టల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి


ప్రజాపక్షం / ఖమ్మం రూరల్ : గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డులో రూ.2.5 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బాలుర గిరిజన వసతి గృహానికి కలెక్టర్ దివాకర్ టిఎస్ తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. సుమారు 150 మంది విద్యార్థులకు వసతి కల్పించేలా ఈ హాస్టల్‌ను నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బాలుర హాస్టల్‌తో పాటు బాలికల గిరిజన వసతి గృహానికి కూడా రూ.5 కోట్లు మంజూరయ్యాయని వెల్లడించారు. బాలికల హాస్టల్‌కు త్వరలోనే శంకుస్థాపన చేసి, రెండు వసతి గృహాల నిర్మాణాలను ఎనిమిది నుంచి తొమ్మిది నెలల్లో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మొత్తం రూ.5 కోట్లతో సుమారు 300 మంది బాలబాలికలకు మెరుగైన వసతి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు.


మూడేళ్లలో రూ.14 కోట్ల అభివృద్ధి పనులు


ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని టీఎన్జీవో కాలనీ ప్రాంతంలో గత మూడేళ్లలో సుమారు రూ.14 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. కొన్ని పనులు పూర్తయ్యాయని, మరికొన్ని పురోగతిలో ఉన్నాయని వివరించారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.


సంక్షేమ పథకాలతో పేదలకు అండ


రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పొంగులేటి పేర్కొన్నారు. సన్నబియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డులు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా రెండు విడతల్లో ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. రైతులకు రైతు భరోసా, రుణమాఫీతో పాటు సన్నధాన్యం పండించే రైతులకు మద్దతు ధరకు అదనపు ప్రోత్సాహకం అందిస్తున్నట్లు వివరించారు.


రెండో పంట సాగుపై రైతులకు విజ్ఞప్తి


ప్రస్తుత పరిస్థితుల్లో వర్షాభావం, నీటి లభ్యత వంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని రైతులు రెండో పంట సాగు విషయంలో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటోందని తెలిపారు. పరిస్థితులను అర్థం చేసుకుని, అందుబాటులో ఉన్న నీటి వనరులకు అనుగుణంగా సాగు నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.


దసరా పండుగను పురస్కరించుకుని ప్రజలందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, అమ్మవారి ఆశీస్సులతో అందరి కోరికలు నెరవేరాలని ఆకాంక్షించారు.


ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో శ్రీనివాసరావు,  మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయం ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి , మున్సిపల్ చైర్‌పర్సన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, కమిషనర్  శ్రీనివాస్ రెడ్డి , తహసిల్దార్ వినయంధర్ రెడ్డి , కాంగ్రెస్ కౌన్సిలర్లు సోము వెంకటరెడ్డి, వెంపటి ఉమా, రవీందర్  పూల్చంద్, బుర్ర మహేష్, కడవ నవీన్  ప్రసాద్,  మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు బానోతు కిషోర్,  వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది