గీత కార్మికుల సంక్షేమానికి రూ.5 వేల కోట్ల నిధులు కేటాయించాలి
కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొండం కరుణాకర్ డిమాండ్
ప్రజాపక్షం / ఖమ్మం రూరల్ : కాలానుగుణంగా అన్ని వృత్తుల్లో ఆధునిక పద్ధతులు అందుబాటులోకి వస్తున్నప్పటికీ, ప్రమాదకరమైన కల్లుగీత వృత్తిలో మాత్రం ఆశించిన స్థాయిలో మార్పులు రావడం లేదని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొండం కరుణాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. గీత కార్మికుల సంక్షేమం, వృత్తి ఆధునీకరణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తెల్దారుపల్లి గ్రామంలో ఎరకల కృష్ణ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో కొండం కరుణాకర్ మాట్లాడారు. ప్రభుత్వాలు కల్లుగీత వృత్తిని నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. తరతరాలుగా ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కార్మికుల భద్రత, ఆర్థికాభివృద్ధి, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. 1957 అక్టోబర్ 19న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని గార్లలో ఏర్పాటైన కల్లుగీత కార్మిక సంఘం అప్పటి నుంచి కార్మికుల హక్కుల సాధన కోసం అనేక పోరాటాలు నిర్వహిస్తోందని తెలిపారు. గీత కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని కోరారు.
గీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
కల్లుగీత కార్పొరేషన్‌కు రాష్ట్ర బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కేటాయించి, ఆ నిధులను గీత కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయాలని కరుణాకర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీల మేరకు గీత కార్మికుల పెన్షన్‌ను నెలకు రూ.4 వేలకు పెంచాలని, ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియాను రూ.10 లక్షలకు పెంచాలని కోరారు. గీత కార్మికుడు మరణిస్తే అతని భార్యకు వెంటనే పెన్షన్ వర్తింపజేయాలని, ఎలాంటి షరతులు లేకుండా 50 సంవత్సరాలు నిండిన గీత కార్మికులందరికీ పెన్షన్ అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
వృత్తి ఆధునీకరణకు పరిశ్రమలు ఏర్పాటు చేయాలి
నీరా, తాటి, ఈత ఉత్పత్తుల ఆధారంగా పరిశ్రమలు నెలకొల్పాలని, ప్రతి గీత కార్మిక సొసైటీకి చెట్ల పెంపకం కోసం ఐదు ఎకరాల చొప్పున భూమి కేటాయించాలని సూచించారు. కల్లుగీత సొసైటీలను బలోపేతం చేసి, వాటికి క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ప్రతి సభ్యుడికి ద్విచక్ర వాహనం అందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కల్లులోని పోషక విలువలు, ఔషధ గుణాలపై ప్రభుత్వం విస్తృత ప్రచారం నిర్వహించి, ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని అన్నారు. మద్యం దుకాణాల్లో 25 శాతం రిజర్వేషన్ కల్పించి, ఆ అవకాశాలను గీత కార్మిక సొసైటీలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలని, రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో నీరా కేఫ్‌లను ఏర్పాటు చేయాలని కోరారు. గీత కార్మికుల సంక్షేమం, వృత్తి అభివృద్ధి కోసం ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ డిమాండ్లను అమలు చేయాలని కొండం కరుణాకర్ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు ఆలూరు కోటయ్య, జలగం వెంకట్రావు, బోడపట్ల కార్తీక్, సభ్యులు బోడపట్ల నగేష్, బండారు శ్రీను, అయితే గాని సత్యం, నాగయ్య, రామకృష్ణ, వంగూరు వెంకన్న, మండవ శ్రీను, మండవ సైదులు, బొమ్మగాని రమేష్, బోడపట్ల పాండు, ఆలూరి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి