అభిమాన నాయకుడిని కలుసుకుని ఫోటో దిగడంతో ఆనందం వ్యక్తం చేసిన వినయ్ - కుటుంబ సభ్యులు
ప్రజాపక్షం/కూసుమంచి: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ బాలుడి కోరికను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి నెరవేర్చారు. కూసుమంచి మండలం నరసింహులగూడెం గ్రామానికి చెందిన కర్నె ఆదినారాయణ కుమారుడు వినయ్ (13) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తన అభిమాన నాయకుడు కేటీఆర్‌ను కలిసి, ఆయనతో ఫోటో దిగాలన్న తన మనసులోని కోరికను కుటుంబ సభ్యుల ద్వారా మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డికి తెలియజేశాడు. బాలుడి కోరికను తెలుసుకున్న కందాళ ఉపేందర్ రెడ్డి చొరవతో శనివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో వినయ్‌కు కేటీఆర్‌ను కలుసుకునే అవకాశం లభించింది. ఈ సందర్భంగా కేటీఆర్ బాలుడితో ఆప్యాయంగా మాట్లాడి, అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అవసరమైన వైద్య సహాయం అందించేందుకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. తన అభిమాన నాయకుడిని స్వయంగా కలుసుకుని, ఆయనతో ఫోటో దిగాలన్న చిరకాల కోరిక నెరవేరడంతో వినయ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. బాలుడి కోరికను నెరవేర్చడమే కాకుండా, అతని ఆరోగ్య పరిస్థితిపై స్పందించి వైద్య సహాయం అందిస్తానని భరోసా ఇవ్వడంపై కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. తమ కుమారుడి కోరిక నెరవేరేలా చొరవ చూపిన మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డికి, తమతో ఆప్యాయంగా మాట్లాడి అండగా ఉంటానని భరోసా ఇచ్చిన కేటీఆర్‌కు వినయ్ కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి