ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

అమ్మా.. ఇక మమ్మల్ని ఎవరు చూసుకుంటారు?


 


ఇద్దరు చిన్నారులకు తీరని శోకం.. విద్యుత్ షాక్‌తో తల్లి మృతి

మృతురాలి భౌతికకాయానికి సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ నివాళులు

ప్రజాపక్షం / ఖమ్మం రూరల్: అమ్మ ఒడిలో హాయిగా నిద్రపోవాల్సిన వయసు వారిది.. అమ్మ చేయి పట్టుకుని లోకాన్ని చూడాల్సిన పసి ప్రాయంలోనే ఆ ఇద్దరు చిన్నారులకు తీరని విషాదం ఎదురైంది. క్షణాల్లో జరిగిన విద్యుత్ ప్రమాదం ఓ తల్లి ప్రాణాలను బలిగొంది. ఇద్దరు చిన్నారులకు అమ్మ ప్రేమను శాశ్వతంగా దూరం చేసింది. ఆ కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 32వ వార్డుకు చెందిన సిపిఐ కార్యకర్త చల్ల ఉపేందర్ భార్య చల్ల కవిత (26) శుక్రవారం ఉదయం విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందింది. ఎంతో చిన్న వయసులోనే ఆమె ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

 ఇద్దరు చిన్నారులకు ఇక అమ్మ ఎవరు?

కవితకు ఇద్దరు చిన్న కూతుళ్లు ఉన్నారు. అమ్మే లోకంగా బతికే ఆ చిన్నారులకు తల్లి ఇక లేదనే నిజాన్ని అర్థం చేసుకునే వయసు కూడా ఉండకపోవచ్చు. ఆకలేస్తే అమ్మ కావాలి.. భయమేస్తే అమ్మ ఒడే కావాలి.. ఏడిస్తే కన్నీళ్లు తుడిచే అమ్మ చేతులే కావాలి. కానీ ఆ చిన్నారులకు ఇక ఆ ప్రేమను పంచే తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. తన పిల్లలను ప్రయోజకులుగా చూడాలని, వారి భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కని ఉంటుందా తల్లి. పిల్లలతో కలిసి ఎన్నో మధుర క్షణాలు గడపాలని ఆశపడి ఉంటుంది. కానీ అనుకోని విద్యుత్ ప్రమాదం ఆ కుటుంబ జీవితాన్ని ఒక్కసారిగా చీకటిమయం చేసింది. తల్లి కళ్ల ముందే పెరగాల్సిన ఆ చిన్నారుల జీవితాల్లో అమ్మ ప్రేమ తీరని లోటుగా మిగిలిపోయింది. భార్యను కోల్పోయిన ఉపేందర్‌కు ఈ విషాదం భరించలేని బాధను మిగిల్చింది. తల్లిని కోల్పోయిన ఇద్దరు చిన్నారుల భవిష్యత్తును తలచుకుంటే హృదయం కలచివేస్తుంది. నిన్నటి వరకు అమ్మ ఒడిలో భద్రంగా ఉన్న ఆ చిన్నారులు.. ఇక జీవితాంతం తల్లి లేని లోటును మోయాల్సి రావడం స్థానికులను కలచివేసింది.

కవిత భౌతికకాయానికి దండి సురేష్ నివాళులు

చల్ల కవిత మృతి విషయం తెలుసుకున్న సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ ఆమె భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది