దివ్యాంగ అభిమాని కల నెరవేర్చిన మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి
కేటీఆర్‌తో ఫొటో దిగాలన్న కోరిక నెరవేరడంతో మురిసిపోయిన అఖిల్
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: అభిమానం అంటే పదవులు, హోదాలతో సంబంధం లేనిది.. మనసులో నుంచి పుట్టే స్వచ్ఛమైన అనుబంధం. అలాంటి అభిమానంతో తనకు ఇష్టమైన నాయకుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌తో ఒక్క ఫొటో దిగాలని ఆశపడిన ఓ దివ్యాంగ అభిమాని కోరిక నెరవేరింది. పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి చొరవతో ముత్యాలగూడానికి చెందిన అఖిల్ కల సాకారమైంది. ఖమ్మం రూరల్ మండలం కామంచికల్లు గ్రామపంచాయతీ పరిధిలోని ముత్యాలగూడానికి చెందిన అఖిల్‌కు కేటీఆర్‌ను నేరుగా కలిసి ఫొటో దిగాలనే కోరిక ఉండేది. ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో కేటీఆర్‌తో అఖిల్‌కు ఫొటో దిగే అవకాశం కల్పించారు. తన అభిమాన నాయకుడిని కలుసుకుని ఫొటో దిగడంతో అఖిల్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
“నాకు ఏమీ వద్దు.. మీరు సీఎం అయితే చాలు!”
ఈ సందర్భంగా కేటీఆర్ అఖిల్‌తో ఆప్యాయంగా మాట్లాడారు. “నీకు ఏం కావాలి? ఏం చేయమంటావు?” అని అడగగా.. అందుకు అఖిల్ చెప్పిన సమాధానం అక్కడున్న వారిని ఆకట్టుకుంది. “నాకు ఏమీ వద్దు.. మీరు ముఖ్యమంత్రి అవుతారు.. నాకు అదే సంతోషం” అంటూ తన అభిమానాన్ని చాటుకున్నాడు. అఖిల్ మాటలకు ముగ్ధుడైన కేటీఆర్ పక్కనే ఉన్న కందాల ఉపేందర్ రెడ్డిని ఉద్దేశించి.. “అంకుల్.. ఎవరీ గొప్పోడు!” అంటూ ఆశ్చర్యంతో, ఆప్యాయంగా స్పందించారు. అనంతరం అఖిల్‌కు సహాయం చేసే విషయం చూసుకుంటానని భరోసా ఇస్తూ.. “ముందు భోజనం చేయి” అంటూ ప్రేమగా సూచించారు. ఈ ఘటన సాక్షిగా అభిమానం అనే పేరుకు నిలువెత్తు రూపాన్ని ఆవిష్కరించినట్లు కనిపించింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి