ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

సంవత్సరం మిస్టరీకి తెర.. సామినేని రామారావు హత్య కేసులో నలుగురి అరెస్ట్!



 


24 మందిపై అనుమానాలు.. పాలిగ్రాఫ్ పరీక్షలు.. ఫోరెన్సిక్ విశ్లేషణతో కీలక మలుపు


బెంగళూరు ఫోరెన్సిక్ ల్యాబ్ ఆధారాలు.. గుజరాత్ నిపుణుల సహకారంతో దర్యాప్తులో పురోగతి


నేరానికి ఉపయోగించినట్లు భావిస్తున్న రెండు కత్తులు, రెక్కీకి వినియోగించిన నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం


ప్రజాపక్షం/ఖమ్మం: ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన సామినేని రామారావు హత్య కేసులో సుదీర్ఘ దర్యాప్తు అనంతరం పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. 2025 అక్టోబర్ 31న తెల్లవారుజామున తన ఇంటి పక్కనే ఉన్న కొట్టంలో రామారావు దారుణ హత్యకు గురికావడం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. తొలుత సాధారణ హత్య కేసుగా నమోదైన ఈ ఘటన.. కాలక్రమంలో అనేక అనుమానాలు, ప్రశ్నలు, రాజకీయ చర్చలకు కేంద్రబిందువుగా మారింది. తాజాగా ఫోరెన్సిక్ విశ్లేషణతోపాటు వివిధ ఆధారాలను సమన్వయం చేస్తూ పోలీసులు నిందితులను గుర్తించి గురువారం తమ్ముడు తీసుకురా పో నాన్న అరెస్టు చేయడంతో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.


ఆది నుంచి అంతుచిక్కని మిస్టరీ..


2025 అక్టోబర్ 31న తెల్లవారుజామున రామారావు హత్యకు గురైన ఘటనపై ఆయన భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు చింతకాని పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదైంది. అయితే ఈ హత్య వెనుక ఎవరున్నారు? ఎందుకు చేశారు? నేరానికి ఉపయోగించిన పద్ధతి ఏమిటి? అనే ప్రశ్నలు దర్యాప్తు బృందానికి సవాలుగా మారాయి. ఘటనపై విస్తృత చర్చ జరగడంతో కేసు రాష్ట్రవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు రాజకీయ కోణంలోనూ చర్చలు సాగడంతో కేసు మరింత ఆసక్తికరంగా మారింది. అయినప్పటికీ, చర్చలు, అనుమానాలు ఒకవైపు కొనసాగుతుండగా.. నేరాన్ని నిరూపించగల ఆధారాలను సేకరించడం పోలీసులకు కీలకంగా మారింది.


24 మందిపై అనుమానాలు.. పాలిగ్రాఫ్ పరీక్షలు


దర్యాప్తులో భాగంగా పోలీసులు మొత్తం 24 మందిని అనుమానితులుగా పరిగణించినట్లు సమాచారం. కేసులో వాస్తవాలను వెలికితీసేందుకు ఖమ్మం మూడో అదనపు జ్యుడీషియల్ ఫోర్త్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు. అయితే ఇలాంటి పరీక్షల ఫలితాలే నేర నిర్ధారణకు తుది ఆధారం కావు. ఇతర సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలతో వాటిని సమన్వయం చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తును కొనసాగించారు.


బెంగళూరు ఆధారాలు.. గుజరాత్ నిపుణుల సహకారం


కేసు దర్యాప్తులో కీలక మలుపుగా 2026 జనవరిలో బెంగళూరులోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో లభించిన ఆధారాలతోపాటు ఇతర వివరాలను పోలీసులు విశ్లేషించినట్లు వెల్లడైంది. వాటిని పరస్పరం సరిపోల్చి పరిశీలించేందుకు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించారు. దర్యాప్తును మరింత బలోపేతం చేసేందుకు గుజరాత్ రాష్ట్రంలోని ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ నిపుణుల సహకారాన్ని కూడా తీసుకున్నారు. ఆరుగురు సభ్యులతో కూడిన నిపుణుల బృందం ఖమ్మం వచ్చి ఫోరెన్సిక్ విశ్లేషణ నిర్వహించింది. ఈ విశ్లేషణలో లభించిన సమాచారం, ఇప్పటికే సేకరించిన ఇతర ఆధారాలను కలిపి పరిశీలించిన అనంతరం నలుగురు వ్యక్తులను నిందితులుగా గుర్తించి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సుదీర్ఘకాలంగా కొనసాగిన ఈ కేసులో శాస్త్రీయ ఆధారాల విశ్లేషణకు ప్రాధాన్యం లభించడం దర్యాప్తులో కీలక పరిణామంగా నిలిచింది.


నలుగురు నిందితుల అరెస్ట్



పోలీసులు అరెస్టు చేసిన వారిని బోడపట్ల శ్రీనివాసరావు అలియాస్ మెంటల్ శ్రీను (34), నూకల లింగయ్య (43), మల్లారపు లక్ష్మయ్య (24), కర్లపూడి ఉదయ్‌కుమార్ (39)గా గుర్తించారు. వీరు వరుసగా ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లి ప్రాంతాలకు చెందినవారిగా వివరించారు. వారి వద్ద నుంచి నేరానికి ఉపయోగించినట్లు ఆరోపిస్తున్న రెండు కత్తులు, రెక్కీ సమయంలో వినియోగించినట్లు భావిస్తున్న నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 


దర్యాప్తు బృందానికి సీపీ అభినందనలు


ఈ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన వైరా ఏసీపీ సారంగపాణి, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వెంకటప్రసాద్, సబ్‌ఇన్‌స్పెక్టర్లు వీరేంద్ర, శ్రీజ, నరేష్‌లను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రత్యేకంగా అభినందించారు. కేసుకు సంబంధించిన వివరాలను సీపీ నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది