రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
రూ.5 కోట్లతో చేపట్టేందుకు ఆమోదించినట్లు వెల్లడి
తెల్లారుపల్లి 14,15,16వ వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: తెల్దారుపల్లి వద్ద స్థానిక రైతులు గ్రామానికి అవతల వైపు ఉన్న తమ వ్యవసాయ భూముల వద్దకు వెళ్లేందుకు, గ్రామస్తుల సౌకర్యార్ధం రూ.5 కోట్ల నిధులతో ఎన్నెస్పి కాలువపై నూతన బ్రిడ్జిని నిర్మిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. మంగళవారం తెల్దారుపల్లి లోని 14,15,16వ వార్డుల్లో రూ. 3.20 కోట్లతో నిర్మించే సిసి రోడ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం కలెక్టర్ దివాకర.టిఎస్, ఏదులాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్ లతో కలిసి మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం వచ్చిన ఈ 33 నెలల్లో తెల్దారుపల్లి అభివృద్ధికి.. రూ. 16.06 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. రూ.5.25 కోట్లతో 105 ఇందిరమ్మ ఇళ్లను పేదలకు ఇచ్చామని చెప్పారు. గత ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని, ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ, ఎకరాకు రూ.6వేల చొప్పున ఏడాదికి రూ. 12 వేల రైతు భరోసా అందిస్తున్నామని చెప్పారు. గత పాలకులు వరి పంట వేస్తే ఊరే అని రైతులను బెదిరించాలని, తామొచ్చాక సన్న రకం దాన్యం రైతులకు బోనస్ ఇచ్చి ప్రోత్సహించామని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్లకు రూ. 40వేల కోట్లు
మన రాష్ట్రంలో రెండు విడతల్లో ఏడు లక్షల ఇందిరమ్మ ఇళ్లను కేటాయించామని, హైదరాబాద్ నగరంలో అర్హులైన పేదలకు లక్ష ఇళ్లు ఇస్తున్నామని..మొత్తం రూ. 40,000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
అర్హులైన రైతులందరికీ 'భూధార్' కార్డులిస్తాం
రాష్ట్రంలో సుమారు 125 సంవత్సరాల క్రితం భూముల సర్వే జరిగిందని, మళ్లీ ఇప్పుడు తమ ప్రభుత్వం సర్వే చేపించి, రైతులకు పూర్తి భరోసా కల్పించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు మంత్రి అన్నారు. పాలేరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ ఈ సర్వేను వెంటనే చేపట్టాలని ఇప్పటికే కలెక్టర్ కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మద్ధులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ బైరు హరినాధ బాబు, ఆర్డీవో శ్రీనివాస్, ఏదులాపురం మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షులు బానోత్ కిషోర్ నాయక్, పలువురు కౌన్సిలర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి