ఆరుబయట నిలిచిన విద్యార్థులు, ఉపాధ్యాయులు
మరమ్మతుల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని కాంట్రాక్టర్ నిరసన
కుటుంబ సభ్యులతో కలిసి పెట్రోల్ బాటిల్‌తో ఆందోళన
ప్రజాపక్షం/ ఖమ్మం రూరల్: ఖమ్మం నగరంలోని దానవాయిగూడెం ప్రభుత్వ పాఠశాలలో సోమవారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పాఠశాల మరమ్మతు పనులు పూర్తి చేసినప్పటికీ తనకు రావాల్సిన బిల్లులు మంజూరు కాలేదని ఆరోపిస్తూ కాంట్రాక్టర్ చల్లా అయోధ్య పాఠశాల భవనానికి తాళం వేశారు.మన ఊరు–మన బడి కార్యక్రమం కింద చేపట్టిన పనులకు సంబంధించి సుమారు రూ.11 లక్షలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని కాంట్రాక్టర్ పేర్కొన్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.స్కూల్‌కు వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు బయటే నిలిచిపోవాల్సి వచ్చింది. అనంతరం విద్యార్థులను సమీపంలోని అంగన్వాడీ కేంద్రంలో కూర్చోబెట్టి తరగతులు నిర్వహించినట్లు సమాచారం.ఈ సందర్భంగా కాంట్రాక్టర్ కుటుంబ సభ్యులతో కలిసి పెట్రోల్ బాటిల్ చేతబట్టి నిరసన వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి