- స్టేషన్లో బిక్కుబిక్కుమంటూ తల్లిదండ్రుల కోసం ఎదురుచూసిన బాలుడు...
ప్రజాపక్షం/ ఖమ్మం రూరల్ :
ఒక చిన్నారి కళ్లలో కనిపించిన భయం.. తల్లిదండ్రుల కోసం ఎదురు చూసిన ఆ ఆందోళన.. చూసిన ప్రతి ఒక్కరినీ కదిలించింది. ఖమ్మం నగరం, ఖమ్మం రూరల్ మండలంలోని వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయిన ఓ చిన్నారి మిస్సింగ్ ఘటన చివరకు సుఖాంతంగా ముగిసినా, ఆ బాలుడు పోలీస్ స్టేషన్లో గడిపిన క్షణాలు అందరి మనసులను తాకాయి. తప్పిపోయిన చిన్నారిని గుర్తించిన స్థానికులు పోలీసులకు అప్పగించగా, అతడిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెలియక చిన్నారి బిక్కుబిక్కుమంటూ ఏడవడం, ఎక్కి ఎక్కి రోదించడం అక్కడున్న వారిని భావోద్వేగానికి గురిచేసింది. అలసిపోయి వెయిటింగ్ కుర్చీల్లోనే నిద్రపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒక విధంగా కుటుంబ సభ్యులు వచ్చి చిన్నారిని తీసుకెళ్లడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.ఈ ఘటన ఒక విషయాన్ని మాత్రం మళ్లీ గుర్తు చేసింది పిల్లలు కేవలం ఇంటి బాధ్యత కాదు, సమాజం మొత్తం అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత కూడా. చిన్నారులు బయటకు వెళ్లినప్పుడు వారిపై ఓ కన్ను ఉండటం, కొద్దిసేపైనా కనిపించకపోతే వెంటనే స్పందించడం ఎంత ముఖ్యమో ఈ సంఘటన తెలియజేసింది. చివరికి చిన్నారి తల్లిదండ్రుల చేతుల్లోకి చేరిన ఆ క్షణం.. అక్కడున్న వారి ముఖాల్లో కనిపించిన ఆనందమే ఈ కథకు నిజమైన ముగింపు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి