– సోషల్ మీడియా స్పందనతో నిమిషాల్లో లభించిన ఆచూకీ
ప్రజా పక్షం/ఖమ్మం రూరల్ : క్షణాల్లో కనిపించకుండా పోయిన కుమారుడి కోసం తల్లిదండ్రులు ఆందోళనతో వెతికిన వేళ.. సోషల్ మీడియా ఆశాకిరణంగా మారి చివరకు చిన్నారిని సురక్షితంగా వారి ఒడికి చేర్చిన హృదయాన్ని కదిలించే ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పంపింగ్ వెల్ రోడ్డు 30వ డివిజన్‌కు చెందిన అయాన్ ఇంటి ముందు అమాయకంగా ఆడుకుంటూ ఉండగా ఒక్కసారిగా కనిపించకుండా పోయాడు. కుమారుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎక్కడ వెతికినా కనిపించకపోవడంతో క్షణాలు గంటల్లా మారాయి.ఇదే సమయంలో టీఎన్జీవోస్ కాలనీ సమీపంలో చిన్నారిని గుర్తించిన ఖమ్మం రూరల్ పోలీసులు అతడిని భద్రంగా తమ వద్ద ఉంచారు. అనంతరం చిన్నారి వివరాలను వాట్సాప్ ద్వారా ప్రజలకు చేరవేస్తూ, బాలుడి కుటుంబ సభ్యులు వచ్చి తీసుకెళ్లాలని సమాచారం పంపించారు.మరోవైపు తమ బిడ్డ కోసం ఆరాటపడుతున్న తల్లిదండ్రులు కూడా చిన్నారి ఫోటోతో పాటు ఆచూకీ తెలిసిన వారు సంప్రదించాలని సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేశారు. ఈ రెండు పోస్టులు వేగంగా వ్యాపించడంతో కొద్ది నిమిషాల్లోనే కుటుంబ సభ్యులకు సమాచారం చేరింది.చివరకు ఆందోళనతో గడిచిన క్షణాలకు ముగింపు పలుకుతూ చిన్నారి అయాన్ తల్లిదండ్రుల ఒడికి చేరాడు. కుమారుడిని మళ్లీ చూసిన ఆ క్షణంలో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఘటనలో సోషల్ మీడియా, పోలీసుల చొరవ చిన్నారి కుటుంబానికి ఆనందాన్ని తిరిగి తీసుకొచ్చింది.

إرسال تعليق