ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

విద్యారంగానికి సర్కారు పెద్దపీట

 



 - రూ.2.25 కోట్లతో గురుకుల కళాశాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన


- పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వసతులు : మంత్రి పొంగులేటి


 - రూ.6.75 కోట్లతో ఊటవాగు తండా చెక్‌డ్యాం నిర్మాణానికి భూమిపూజ


ఖమ్మం/ఖమ్మం రూరల్ : రాష్ట్రంలో విద్యారంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో కార్పొరేట్‌ స్థాయి మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తోందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శనివారం ఖమ్మం నగర పరిధిలోని దానవాయిగూడెం TGSWRIES బాలికల జూనియర్ కళాశాలలో రూ.2.25 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి, మరమత్తుల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ప్రభుత్వ గురుకులాల్లో చదువుకునే పేద కుటుంబాల విద్యార్థులకు అత్యుత్తమ బోధనతో పాటు అన్ని రకాల సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సాధారణంగా పరిపాలనా అనుమతులు వచ్చినా పనులు ప్రారంభం కావడానికి, పూర్తి కావడానికి ఏళ్ల సమయం పడుతుందని.. కానీ, ఈ కళాశాలలో అధికారులు, ప్రిన్సిపాల్‌ సమన్వయంతో పనులను వేగవంతం చేయడం అభినందనీయమన్నారు. పాఠశాలను తమ సొంత ఇంటిలా భావించి అభివృద్ధికి శ్రమిస్తున్న ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు.డైట్‌, కాస్మెటిక్‌ ఛార్జీల పెంపుతో అండగా నిలిచాం... రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గురుకుల విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగానే విద్యార్థుల డైట్ ఛార్జీలను 40 శాతం, కాస్మెటిక్ ఛార్జీలను ఏకంగా 200 శాతం మేర పెంచి పేద తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని తగ్గించామన్నారు. విద్యార్థినులు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకుని చదువుల్లో రాణించాలని, ఈ గురుకులాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలపాలని పిలుపునిచ్చారు. రాబోయే 15 రోజుల్లో కళాశాల ప్రాంగణం, క్రీడా మైదానాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అదనపు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.


ఊటవాగు తండా వద్ద చెక్‌డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన..

అనంతరం ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడు, తీర్ధాల గ్రామాల సమీపంలోని ఊటవాగు తండా వద్ద రూ.6.75 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న చెక్ డామ్ పనులకు మంత్రి పొంగులేటి భూమిపూజ చేశారు. ఈ ప్రాంత రైతులకు సాగునీటి ఇబ్బందులు తొలగించేందుకు ఈ ప్రాజెక్టు ఎంతో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో ఖమ్మం ఆర్డీవో శ్రీనివాస్, ఆర్‌ అండ్‌ బీ ఈఈ బషీర్, కళాశాల ప్రిన్సిపాల్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది