– ఎమర్జెన్సీ దేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయం
ప్రజాపక్షం / నేలకొండపల్లి: దేశ ప్రజాస్వామ్య చరిత్రలో 1975 జూన్ 25 ఒక చీకటి రోజుగా నిలిచిపోయిందని, అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దేశంపై ఎమర్జెన్సీని రుద్ది ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీశారని బీజేపీ మండల అధ్యక్షుడు పాగర్తి సుధాకర్ విమర్శించారు.గురువారం నేలకొండపల్లి మండల కేంద్రంలో మండల ప్రధాన కార్యదర్శి మల్లెపోయిన గోవిందరావు అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజల హక్కులు కాలరాయబడ్డాయని, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛతో పాటు పత్రికా స్వేచ్ఛను కూడా అణచివేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి పౌరుడు చైతన్యవంతంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగిన ఆ చర్యలను గుర్తుచేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం జూన్ 25ను ‘సంవిధాన్ హత్యా దివస్’గా ప్రకటించిందని తెలిపారు. నాటి పరిస్థితులను యువతకు తెలియజేసి ప్రజాస్వామ్య విలువల పట్ల అవగాహన కల్పించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయాలంటే చరిత్రను తెలుసుకోవడం అవసరమని, ఎమర్జెన్సీ కాలం నుంచి పాఠాలు నేర్చుకోవాలని ఆయన పేర్కొన్నారు.ఈ సమావేశంలో బీజేపీ నాయకులు పురాణం దివాకర్, కొండా హర్షవర్ధన్, పిట్టల సూరిబాబు, తొగటి నాగచారి, ఎలివేటి వెంకటేశ్వర్లు, జోగపర్తి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق