మాట్లాడుతున్న దృశ్యం
సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మొహమ్మద్ మౌలానా
ప్రజాపక్షం/ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములకు వెంటనే పట్టాలు మంజూరు చేయడంతో పాటు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఆలస్యం లేకుండా విడుదల చేయాలని సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మొహమ్మద్ మౌలానా డిమాండ్ చేశారు.ఖమ్మం బైపాస్ రోడ్డులోని సిపిఐ జిల్లా కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా కార్యదర్శి భానోత్ జగన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మొహమ్మద్ మౌలానా మాట్లాడుతూ, గిరిజనులు మరియు బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.బడుగు, బలహీన వర్గాల బాలబాలికలకు మెరుగైన హాస్టల్ వసతులు కల్పించడంతో పాటు తండాలు, గూడాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఆయన అన్నారు. పోడు భూముల సమస్యను ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకుని గిరిజనులకు న్యాయం చేయాలని కోరారు.తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు అజ్మీర రామ్మూర్తి నాయక్ మాట్లాడుతూ, చేవెళ్ల డిక్లరేషన్‌లో గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించి, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా నాయకులు బానోతు రామకోటి, బోడ ఈరన్న, బానోత్ రాంబాబు, బానోత్ రామ్మూర్తి, భూక్యా నరసింహ, బోడా చిన తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి