![]() |
| చెక్ డ్యాం నిర్మితం కాబోతున్న ప్రాంతం |
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలం ఊటవాగు తండా–తీర్థాల మధ్య ఆకేరుపై నిర్మాణం కోసం శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేసిన చెక్‌డ్యాం ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇది కేవలం అభివృద్ధి పనిగా మాత్రమే కాకుండా దశాబ్దాల చరిత్రను గుర్తు చేసే అంశంగా నిలుస్తోంది. గతంలో తేజావత్ కుటుంబ సభ్యులు ఈ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డ సమయంలో ఆకేరు ప్రవాహం వారి జీవితాలను ప్రభావితం చేసేది. నీరు లేని కాలంలో ఊటవాగు వైపు నుంచి తీర్థాల వైపు వెళ్లి వ్యవసాయ పనులు చేసుకునేవారు. అయితే ఆకేరు ప్రవహిస్తే రెండు వైపుల రాకపోకలు నిలిచిపోయి నెలల తరబడి ఉన్న చోటే ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడేవి.ఆ పరిస్థితుల నేపథ్యంలోనే కొంతకాలానికి తేజావత్ కుటుంబాలు ఊటవాగు తండా, తీర్థాల ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నాయి.ఇప్పుడు అదే ఆకేరుపై చెక్‌డ్యాం నిర్మాణం చేపట్టడం వల్ల సాగునీటి సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు గతంలో వాగు కారణంగా ఎదురైన ఇబ్బందులు తగ్గే అవకాశాలు ఆవిష్కృతం కాబోతున్నాయి. ఒకప్పుడు అడ్డుగా నిలిచిన ఆకేరు, ఇప్పుడు అభివృద్ధికి దారిగా మారుతుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

إرسال تعليق