కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం.. సీఎం ఖమ్మం పర్యటనలో సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి
ప్రజాపక్షం / ఖమ్మం రఘునాథపాలెం:రఘునాథపాలెం మండలం 218 సర్వే నంబర్లోని భూ నిర్వాసితులకు ప్రభుత్వం తక్షణమే న్యాయం చేసి, ప్రభుత్వ అవసరాల కోసం భూములు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించాలని ఖమ్మం నగర బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు పగడాల నాగరాజు డిమాండ్ చేశారు. గురువారం బాధితులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డీఆర్వోకు వినతిపత్రం సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.2009లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలో వేలాది మంది పేదలకు ఇంటి స్థలాల పట్టాలు పంపిణీ చేసినప్పటికీ, అందరికీ స్థలాలు అందలేదని తెలిపారు. అనంతరం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చొరవతో తొలి విడతలో సుమారు 650 మంది లబ్ధిదారులకు స్థలాలు కేటాయించగా, చాలామంది ఇళ్ల నిర్మాణం ప్రారంభించారని చెప్పారు.ప్రస్తుతం అమరావతి హైవే, మోడల్ స్కూల్ తదితర ప్రభుత్వ అవసరాల పేరుతో కొంతమంది లబ్ధిదారులను ఖాళీ చేయించాలని అధికారులు సూచిస్తున్నారని, ప్రత్యామ్నాయ స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చినా అమలు కాలేదని ఆరోపించారు. ప్రభుత్వ అవసరాలకు ఆటంకం లేని ప్రాంతాల్లో కూడా ఇళ్లు నిర్మించుకున్న పేదల స్థలాలను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.ఈ సమస్యపై బీఆర్ఎస్ ప్రారంభం నుంచే బాధితుల పక్షాన నిలిచిందని నాగరాజు తెలిపారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ మంత్రి హరీశ్ రావు దృష్టికి సమస్యను తీసుకెళ్లగా, జిల్లా అధికారులకు బాధితులకు న్యాయం చేయాలని సూచించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.రేపు ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లాకు రానున్న నేపథ్యంలో బాధితుల సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకే కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించామని తెలిపారు. భూ నిర్వాసితుల సమస్యను మానవతా దృక్పథంతో పరిశీలించి, ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బుల్డోజర్ పాలన కొనసాగుతోందని ఆరోపించిన ఆయన, పేదల ఇళ్ల కూల్చివేతలపై ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్ చేశారు. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పేదలకు న్యాయం చేయాలని కోరారు.ప్రభుత్వం వెంటనే స్పందించి రఘునాథపాలెం 218 సర్వే నంబర్ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో బాధితుల తరఫున బీఆర్ఎస్ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని పగడాల నాగరాజు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మక్బుల్, బీఆర్ఎస్ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు తాజుద్దీన్, నగర మాజీ ప్రచార కార్యదర్శి సకీనా, చిన్న నాగరాజు, ఉస్మాన్, పోలెపొంగు వెంకట్, గుంటి రాజు, భూ నిర్వాసితులు తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق