ఎస్ఓ–వంట సిబ్బంది వివాదంతో నిలిచిన వంట..
ఆకలితో అలమటించిన 300 మంది విద్యార్థినులు
ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్
ప్రజాపక్షం/బోనకల్ :ఖమ్మం జిల్లా బోనకల్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)లో స్పెషల్ ఆఫీసర్ (ఎస్ఓ) ఇస్లావత్ సక్కుబాయి, పాఠశాల వంట సిబ్బంది మధ్య కొనసాగుతున్న వివాదం బుధవారం తీవ్రరూపం దాల్చింది. ఎస్ఓ వ్యవహారశైలికి నిరసనగా వంట సిబ్బంది విధులకు హాజరుకాకపోవడంతో పాఠశాలలో వంట పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ఉదయం విద్యార్థినులకు అందాల్సిన అల్పాహారం అందక సుమారు 300 మంది విద్యార్థినులు ఆకలితో ఇబ్బందులు పడినట్లు సమాచారం. వసతి గృహంలోనే ఉండి చదువుకుంటున్న విద్యార్థినులకు సకాలంలో ఆహారం అందకపోవడంతో వారు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పాఠశాల యాజమాన్యం, వంట సిబ్బంది మధ్య నెలకొన్న విభేదాల ప్రభావం నేరుగా విద్యార్థినులపై పడటంతో తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.విద్యార్థినుల సంక్షేమం కంటే అంతర్గత విభేదాలే ప్రాధాన్యంగా మారడం దురదృష్టకరమని పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని వారు కోరుతున్నారు.అలాగే విద్యార్థినుల భోజన ఏర్పాట్లలో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని, ఘటనకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి