అరువివ్వని అరుణోదయ గొంతుకు నేడు అశ్రునివాళి
పాటను అమ్ముకోలేదు.. సిద్ధాంతాన్ని విడిచిపెట్టలేదు.. ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన నాగన్నకు ఖమ్మంలో సంస్మరణ సభ
ప్రజాపక్షం / ఖమ్మం రూరల్:ఒక గొంతు మూగబోయింది... కానీ ఆ గొంతు పాడిన పాటలు ఇప్పటికీ వేలాది మంది పెదవులపై మారుమోగుతూనే ఉన్నాయి. ఒక కళాకారుడు ఈ లోకం విడిచిపోయాడు... కానీ ఆయన నమ్మిన సిద్ధాంతం, పాడిన ప్రజా గీతాలు, రగిలించిన చైతన్యం మాత్రం తరతరాలకు స్ఫూర్తిగా నిలిచాయి. అలాంటి అరుదైన ప్రజా గాయకుడు అరుణోదయ నాగన్న సంస్మరణ సభ నేడు (శనివారం) ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో జరగనుంది.నేటి కాలంలో కళను సంపాదనకు, గానాన్ని అధికారాల మెప్పుకోసం వినియోగించే వారు ఎందరో ఉన్నా... నాగన్న మాత్రం తన గొంతును ఎప్పుడూ అమ్ముకోలేదు. ప్రజల బాధలకే తన స్వరాన్ని అంకితం చేశాడు. రైతు, కూలీ, పేద, అణగారిన వర్గాల కన్నీటిని పాటగా మార్చి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశాడు. అందుకే ఆయన కేవలం గాయకుడు కాదు... ఒక ఉద్యమం, ఒక భావజాలం, ఒక చరిత్ర.తిరుమలాయపాలెం మండలం రాజారం గ్రామంలో జన్మించిన నాగన్న చిన్ననాటి నుంచే పాటలపై మక్కువ పెంచుకుని, అనంతరం అరుణోదయ సాహితీ–సాంస్కృతిక ఉద్యమంలో చేరి జీవితాంతం ప్రజా కళాకారుడిగా కొనసాగారు. బుర్రకథ, యక్షగానం, జనగానం, గొల్లసుద్దులు, హరికథ వంటి ఎన్నో జానపద కళారూపాల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని రగిలించారు. ఆయన పాడిన ప్రతి పాటలో పోరాటం ఉండేది... ప్రతి స్వరంలో సామాజిక బాధ్యత వినిపించేది.తెలంగాణ ఉద్యమ సమయంలో వందలాది సభల్లో పాల్గొని ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపిన నాగన్న, ఆర్థిక ఇబ్బందులు వెంటాడినా సిద్ధాంతాలను మాత్రం విడిచిపెట్టలేదు. గుడిసెలో జీవించినా గౌరవంగా జీవించాడు. ప్రజల కోసం పాడిన పాటలే తన అసలు సంపదగా భావించాడు.చికాగో నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ...", "అన్న అమరుడురా...", "కొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మ..." వంటి ఎన్నో పాటలు నేటికీ ప్రజా వేదికలపై మారుమోగుతూనే ఉన్నాయి. నాగన్న గొంతు ఆగిపోయినా, ఆయన గానం మాత్రం అమరత్వాన్ని సొంతం చేసుకుంది.నేడు సాయంత్రం 4 గంటలకు భక్త రామదాసు కళాక్షేత్రంలో జరిగే సంస్మరణ సభలో అరుణోదయ విమలక్క, జీవన్, ఏపూరి సోమన్న, యోచన, ఎస్. పాల్, నాగేశ్వరరావు తదితర ప్రముఖులు పాల్గొని నాగన్నతో తమ అనుబంధాన్ని, ఆయన ప్రజా కళా ప్రస్థానాన్ని స్మరించనున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి