విక్రమ్-1 విజయగాథలో మాధాపురం యువ ఇంజనీర్ నరేందర్ రెడ్డి కీలక పాత్ర
ప్రజాపక్షం/ ముదిగొండ: ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మాధాపురం గ్రామానికి చెందిన మోర్తాల నరేందర్ రెడ్డి భారత అంతరిక్ష రంగంలో తన ప్రతిభతో జిల్లాకు మరోసారి గర్వకారణంగా నిలిచారు. ఈ ఘనతను ఇస్రో నిర్వహించిన తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగంలో భాగస్వామ్యం అయ్యి సాధించాడు. రైతు కుటుంబంలో జన్మించిన నరేందర్ రెడ్డి తండ్రి మోర్తాల హనుమి రెడ్డి, తల్లి లక్ష్మి. సతీమణి శ్రీ వెంకట దివ్య. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, సహకారంతో అంతరిక్ష రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగిన ఆయన ప్రస్తుతం స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థలో టీమ్ లీడ్ – ఇంటిగ్రేషన్ & టెస్టింగ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.ఇటీవల విజయవంతంగా నిర్వహించిన విక్రమ్-1 ప్రయోగంలో కీలక బృంద సభ్యుడిగా పనిచేసిన నరేందర్ రెడ్డి, రాకెట్ ఇంటిగ్రేషన్, పరీక్షలు, ప్రయోగానికి సంబంధించిన కీలక ప్రక్రియల్లో తన వంతు బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించి మిషన్ విజయానికి సహకరించారు.పదేళ్లకు పైగా అంతరిక్ష, రక్షణ రంగాల్లో అనుభవం కలిగిన ఆయనకు లాంచ్ వెహికల్ ఇంటిగ్రేషన్, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్, టెస్టింగ్, లాంచ్ ఆపరేషన్స్ వంటి విభాగాల్లో విశేష నైపుణ్యం ఉంది. భారత అంతరిక్ష రంగ అభివృద్ధిలో తన వంతు సేవలందించడం గర్వంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.గ్రామీణ రైతు కుటుంబం నుంచి అంతరిక్ష రంగంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ దేశ సేవలో భాగస్వామి కావడం ఖమ్మం జిల్లాకు గర్వకారణమని స్థానికులు అభినందిస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి