అనుమతులు పొందేది ఒకలా... వెంచర్లు ఏర్పాటు అయ్యేది మరోలా
వెంకటగిరి, తల్లంపాడు కేంద్రాలుగా సాగుతున్న దందా
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: రియల్ ఎస్టేట్ రంగంలో కొనుగోలుదారులను ఆకర్షించేందుకు రంగురంగుల బ్రోచర్లు, ఆకర్షణీయమైన ప్రకటనలు ప్రధాన ఆయుధాలుగా మారుతున్నాయి. అయితే బ్రోచర్లలో చూపిస్తున్న హామీలు, వాస్తవంగా వెంచర్లలో కనిపిస్తున్న పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డీటీసీపీ (DTCP) అనుమతుల పేరుతో ప్రజల్లో నమ్మకం కల్పించి, ఆ తర్వాత నిబంధనలను పక్కనబెట్టి వెంచర్లను అభివృద్ధి చేస్తున్నట్లు పలువురు బాధితులు చెబుతున్నారు.రియల్ మోసాలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన డీటీసీపీ నిబంధనలు కొందరు రియల్ వ్యాపారులకు వరంగా మారినట్లు తెలుస్తోంది. అనుమతులు పొందే వరకు నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తున్నట్లు చూపించి, అనుమతులు వచ్చిన అనంతరం మాత్రం వెంచర్లలో రోడ్లు, పార్కులు, డ్రైనేజీ, ఓపెన్ స్పేస్లు వంటి సదుపాయాల విషయంలో రాజీ పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి.అందమైన బ్రోచర్లలో విశాలమైన రహదారులు, పచ్చదనం, ఆధునిక సౌకర్యాలు, భవిష్యత్ అభివృద్ధి చిత్రాలను చూపిస్తూ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. కానీ స్థలాన్ని కొనుగోలు చేసిన తర్వాత అక్కడ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉండటంతో పలువురు మోసపోయామని వాపోతున్నారు.ఇటీవల ఖమ్మం రూరల్ మండలాన్ని కుదిపేసిన నకిలీ రియల్ వ్యవహారాల నేపథ్యంలో, గతంలో వివాదాస్పదంగా మారిన కొందరు రియల్ వ్యాపారులే మళ్లీ కొత్త పేర్లతో, కొత్త వెంచర్లతో ఈ దందాను కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వెంకటగిరి, తల్లంపాడు ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని ఈ తరహా వెంచర్లు వేగంగా విస్తరిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.రంగురంగుల బ్రోచర్లను చూసి స్థలాలు కొనుగోలు చేసే ముందు డీటీసీపీ అనుమతుల వివరాలు, లేఅవుట్లో పేర్కొన్న సదుపాయాలు వాస్తవంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే సంబంధిత అధికారులు కూడా అనుమతులు మంజూరు చేసిన వెంచర్లలో నిబంధనలు అమలవుతున్నాయా లేదా అన్న అంశంపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.

إرسال تعليق