ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

మహాదేవా ఇదేమి చోద్యం.!?


గుంటు మల్లేశ్వరుడిపై "మదనుడి" పెత్తనం

స్వామి కైంకర్య సేవల్లో అభివృద్ధి కమిటీ జోక్యం 

మదన మోహనుడి తీరుపై భక్తుల విస్మయం

బెల్లం కొట్టిన రాయి చందాన దేవాదాయశాఖ అధికారుల తీరు

         ఓ గుంటు మల్లేశ్వరా నీపై ఇదేమి పెత్తనమయ్యా.? ఓ మహాదేవా ఇక నీ ఆలయాన్ని నువ్వే కాపాడుకోవాలయా..? అసలు ఆలయ అభివృద్ధి కమిటీ విధి విధాలు ఏంటి.? అభివృద్ధి కమిటీ చైర్మన్ గానీ సభ్యులు కానీ ఆలయంపై పెత్తనం చేయొచ్చా.? అంతేగాక అధికారులపై వల్లమాలిన ఆధిపత్యం ప్రదర్శించవచ్చా.? ఇదిగో 

ప్రజాపక్షం/ఖమ్మం : ఖమ్మం నగర నడి బొడ్డున ఉన్న శ్రీ గుంటు మల్లేశ్వర స్వామి దేవాలయం గురించి తెలిసిన వారందరికీ ఈ ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అత్యంత ప్రాశస్తం కలిగిన స్వయంభు శైవ క్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీ గుంటు మల్లేశ్వర స్వామి దేవస్థానంలో స్వామి వారికి జరిగే కైంకర్య సేవల విషయాల్లో ఆలయ అభివృద్ధి కమిటీ పెత్తనం విస్మయం కలిగిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దేవాలయ కమిటీ వ్యవహారాలు శృతి మించి పాకాన పడుతున్నాయి. "మదనుడి" అధికార దర్పం తాకిడికి అర్చకులే చలించే పరిస్థితులు దాపురిస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే అభివృద్ధి కమిటీ కనుసన్నల్లోనే దేవాదాయ శాఖ అధికారులు సైతం పని చేస్తున్నారన్న దయనీయ స్థితి అక్కడ నెలకొంది. నిత్య పూజా క్రతువుల్లో కూడా ఈ "మోహనుడు" కలగజేసుకొని "నేనే రాజు.. నేనే మంత్రి" అన్నట్లు వ్యవహరిస్తున్న తీరు పెత్తందారీ విధానాన్ని మరిపిస్తుంది. వాస్తవానికి అభివృద్ధి కమిటీ పేరుతో నిధులు సేకరించి ఆలయాన్ని అభివృద్ధి చేయడం కమిటీ సభ్యుల కర్తవ్యం. అలాంటిది ఇతరత్రా విషయాల్లో సైతం కాలుదువ్వుతూ కలుగజేసుకోవడం విస్మయం కలిగిస్తోంది. ఈ పరిమాణాలు ఆలయానికి, ఆలయ ప్రతిష్ఠకు కళంకం తెచ్చేలా ఉన్నాయని భక్తులు వాపోతున్నారు. నిజానికి అభివృద్ధి కమిటీకి ఎటువంటి అధికారాలు కానీ చైర్మన్ పదవులు గాని ఉండవు. కానీ ఇక్కడ దేవాలయంలో మాత్రం చైర్మన్ వ్యవహరిస్తున్న తీరు దేవాదాయ శాఖ అధికారులే భయబ్రాంతులకు గురయ్యేలా ఉంది. ఇటీవల ప్రధాన అర్చకుడి వెసులుబాటు కోసం ప్రభుత్వం నుంచి వెలువడిన ఆర్డర్ ను కూడా సదరు "మదనుడు" ఒంటి చేత్తో నిలిపివేశాడంటే ఇక అతని పెత్తనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కాస్త కొత్త భాషలో చెప్పాలంటే ఇక్కడ తోకే తలనాడిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ ఆధిపత్య ధోరణిని ఇలాగే కొనసాగిస్తే గుంటుమల్లేశ్వర స్వామి ఆలయానికే మాయని మచ్చ ఏర్పడే ప్రమాదం ఉందని భక్తులు వాపోతున్నారు. అభివృద్ధి కమిటీ ఆధిపత్య ధోరణిని నివారించడానికి అధికారులు సైతం జంకుతున్నందున స్వయానా స్థానిక ఎమ్మెల్యే అయిన వ్యవసాయ శాఖా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు జోక్యం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని భక్తులు వేడుకుంటున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది