సిపిఐతో ఉన్న మిత్రధర్మాన్ని పాటించకుండా నిందలు వేయడం తగదు: భాగం హేమంతరావు
కాల్వ ఆక్రమణ ఆరోపణలపై ఘటనా స్థలాన్ని పరిశీలించిన సిపిఐ నిజ నిర్ధారణ కమిటీ
ఆటోనగర్ ఏర్పాటులో మళ్లించిన కాల్వను పునరుద్ధరించాలి: రైతులు
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: సిపిఐతో ఉన్న మిత్రధర్మాన్ని పాటించకుండా రాజకీయ కక్షసాధింపులో భాగంగా నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని సిపిఐ జాతీయ సమితి సభ్యుడు భాగం హేమంతరావు పేర్కొన్నారు.బుధవారం ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డులో ఎన్ఎస్పీ కాల్వను సిపిఐ మాజీ ప్రజాప్రతినిధి ఆక్రమించారనే ఆరోపణల నేపథ్యంలో, మున్సిపాలిటీ సిపిఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీ ఘటనా స్థలాన్ని పరిశీలించింది. ఈ పరిశీలనలో 23, 24, 28, 29, 30, 31, 32 డివిజన్ల శాఖ కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా భాగం హేమంతరావు మాట్లాడుతూ... ఎన్ఎస్పీ కాల్వ ఆక్రమణ జరిగిందనే ఆరోపణలు పూర్తిగా అసత్యమని అన్నారు. ఆటోనగర్ ఏర్పాటు సమయంలో అసలు పంట కాల్వ మార్గాన్ని మార్చివేశారని, ప్రస్తుతం వివాదాస్పదంగా మారిన ప్రాంతం ఆ మార్పుల ఫలితమేనని తెలిపారు.స్థానిక రైతులు కూడా పాత పంట కాల్వను తిరిగి పునరుద్ధరించాలని చాలా కాలంగా కోరుతున్నారని చెప్పారు. రైతులకు సాగునీరు సక్రమంగా అందేలా అధికారులు పాత కాల్వ మార్గాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని, వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. అలాగే కాల్వ మార్పునకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు సిపిఐపై చేస్తున్న అసత్య ఆరోపణలు, కక్షసాధింపు రాజకీయాలను మంత్రి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన సిపిఐ...
సిపిఐ పార్టీకి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి కబ్జాకు పాల్పడ్డారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సిపిఐ నిజ నిర్ధారణ కమిటీ ఘటనా స్థలాన్ని పరిశీలించింది. తొలుత వరంగల్ క్రాస్ రోడ్డులోని సిపిఐ కార్యాలయం వద్దకు చేరుకొని, అక్కడి నుంచి కాలినడకన ర్యాలీగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అసలు కాల్వ ఎక్కడి నుంచి ఉందనే విషయాన్ని మొత్తం పరిశీలించారు.ఈ సందర్భంగా 28, 30, 32 డివిజన్లకు చెందిన సిపిఐ కౌన్సిలర్లు దండి రంగారావు, దండి శ్రీజ, మామిండ్ల శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ... కాల్వ ఆక్రమణ ఆరోపణలు అవాస్తవమని, సిపిఐ పార్టీపై బురద చల్లాలనే ఉద్దేశంతో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అసలు కాల్వ ఇక్కడ లేదని, గతంలో ఆటోనగర్ ఏర్పాటు సమయంలో దానిని మరోవైపు మళ్లించారని పేర్కొన్నారు. తక్షణమే అధికారులు పాత కాల్వను పునరుద్ధరించి, మార్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాల్వను పునరుద్ధరించాలి: రైతులు
ఆటోనగర్ ఏర్పాటులో ఎన్ఎస్పీ కాల్వను మార్చి తమ పొలాలు, నివాసాల వైపు మళ్లించారని అక్కడి రైతులు ఆరోపించారు. ప్రస్తుతం కాల్వగా పేర్కొంటున్నది అసలైన కాల్వ కాదన్నారు. అక్రమ పద్ధతిలో ఏర్పాటు చేసిన కాల్వతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పొలాలకు దారి లేకుండా చేసి, లేని కాల్వను ఉన్నట్లుగా సృష్టించారని ఆరోపించారు. అలాంటి కాల్వను కాకుండా పాత కాల్వను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. అటువంటి కాల్వకు బఫర్ జోన్ అంటూ మా భూములను లాక్కోవాలని చూడటం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో
సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు సిద్దినేని కర్ణకుమార్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మెడకంటి వెంకటరెడ్డి, సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఉన్నం రంగారావు, చెరుకుపల్లి భాస్కర్, బానోతు రామకోటి, వెంపటి సురేందర్, 28, 30, 32 డివిజన్ల కౌన్సిలర్లు దండి రంగారావు, దండి శ్రీజ, మామిండ్ల శ్రీనాథ్ రెడ్డి, సిపిఐ మండల కార్యదర్శి పుచ్చకాయల సుధాకర్, మండల సమితి సభ్యులు మెడకంటి పెద్ద వెంకటరెడ్డి, మామిడి సుదర్శన్ రెడ్డి, బట్ట బాబు, వార్డుల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



إرسال تعليق