ఫిర్యాదు చేసినా సమాచారం లేకుండానే కంప్లైంట్ క్లోజ్ చేశారంటూ ఆరోపణ
ఎస్ఐ స్పందనతో కొంత ఊరట.. సిబ్బంది ప్రవర్తనపై మనోవేదన
ప్రజాపక్షం/నేలకొండపల్లి : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మంగాపురం తండా శివారులోని రేవులగడ్డ తండాకు చెందిన ధీరావతు పుష్పావతి తన భూమి వివాదంపై పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పొరుగువారి భూమి సరిహద్దుల వివాదంలో డిజిటల్ సర్వే నిర్వహించగా తమ భూమిలోని సుమారు రెండు కుంటల స్థలం అక్రమంగా ఆక్రమించబడినట్లు తేలిందని ఆమె తెలిపారు.ఈ అంశంపై జూలై 8న నేలకొండపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు, అప్పటి ఎస్ఐ ఇరు పక్షాలను పిలిచి సమస్యను పరిష్కరిస్తామని, అవసరమైతే కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అయితే ఫిర్యాదు రసీదు ఇవ్వలేదని, తర్వాత సమాచారం అందిస్తామని చెప్పి పంపించారని తెలిపారు.జూలై 18న డీజీపీ కార్యాలయం నుంచి ఫోన్ చేసి ఫిర్యాదు పురోగతి, పోలీసుల వ్యవహారశైలిపై వివరాలు అడిగారని, అనంతరం జూలై 20న పోలీస్ స్టేషన్కు వెళ్లగా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఫిర్యాదును క్లోజ్ చేసినట్లు సిబ్బంది చెప్పారని ఆరోపించారు. దీనిపై ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వకుండా దురుసుగా ప్రవర్తించారని వాపోయారు.అనంతరం ప్రస్తుత ఎస్ఐతో ఫోన్లో మాట్లాడగా, డిజిటల్ సర్వే ఆధారాలు పరిశీలించి అవసరమైతే కేసును తిరిగి (రీ-ఓపెన్) చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఎస్ఐ స్పందనతో కొంత ఉపశమనం కలిగిందని, మరో వారం రోజులు వేచి చూస్తామని చెప్పారు.సమస్య పరిష్కారం కాకపోతే రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించిన ఆమె, ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది కేవలం అధికారులకే పరిమితం కాకుండా కింది స్థాయి సిబ్బందిలోనూ ప్రతిబింబించాలని కోరారు. భవిష్యత్తులో తమలాంటి బాధితులు ఇబ్బందులు పడకుండా పోలీసు శాఖ తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

إرسال تعليق