మూడేళ్లుగా ఇతర ఖాతాలో వితంతు పింఛన్ జమ
2023 నుంచి తనగంపాడులో కొనసాగుతున్న నిర్లక్ష్యం
వెరిఫికేషన్‌లో బయటపడిన అసలు నిజం
గ్రామస్థాయి అధికారి పాత్రపై అనుమానాలు
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్:వితంతువుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చేయూత పింఛన్ పథకం తనగంపాడు గ్రామంలో దారి తప్పిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకటి, రెండు నెలలు కాదు... ఏకంగా మూడేళ్లుగా లబ్ధిదారురాలికి రావాల్సిన పింఛన్ సొమ్ము మరొకరి బ్యాంకు ఖాతాలో జమ అవుతున్నట్లు అధికారుల వెరిఫికేషన్‌లో బయటపడింది.ఖమ్మం రూరల్ మండలం తనగంపాడు గ్రామానికి చెందిన సీతమ్మకు 2023లో ప్రభుత్వం వితంతు పింఛన్ మంజూరు చేసింది. అయితే అప్పటి నుంచి ఆమె ఖాతాలో కాకుండా మరో వ్యక్తి బ్యాంకు ఖాతాలోనే ప్రతి నెలా పింఛన్ జమ అవుతున్నట్లు సమాచారం. దీంతో మూడేళ్లుగా ఆమె ప్రభుత్వ ఆర్థిక సహాయానికి దూరమయ్యారు.ఈ విషయాన్ని బాధితురాలు పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ఇటీవల చేపట్టిన చేయూత పింఛన్ వెరిఫికేషన్ సందర్భంగా అధికారులు విచారణ జరపగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.ఈ ఘటనలో గతంలో గ్రామంలో విధులు నిర్వహించిన ఓ గ్రామస్థాయి అధికారి నిర్లక్ష్యం లేదా ప్రమేయం ఉందనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. బ్యాంకు ఖాతా వివరాలు ఎలా మారాయి? ఎవరి ఖాతాలో పింఛన్ జమ అయింది? ఇందుకు బాధ్యులెవరు? అనే అంశాలపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి