ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

పేదల ఇళ్లే.. ప్రజా పాలన మార్క్! : మంత్రి పొంగులేటి

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు.. రాష్ట్రంలో గుడిసెలే ఉండకూడదనేదే మా సంకల్పం

రూ.1.25 కోట్లతో చండ్రుగొండ మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

మహిళల సాధికారతకు రూ.70 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చి ప్రాధాన్యం ఇచ్చామని వెల్లడి

ప్రజాపక్షం/చండ్రుగొండ ​: ప్రజల ఇంటి గుమ్మం వద్దకే సంక్షేమ పథకాలను చేరవేసి, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి అండగా నిలవడమే తమ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో రూ.1.25 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు గురువారం ఆయన శంకుస్థాపనలు చేశారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ అంకిత్‌లతో కలిసి మంగయ్యబంజార, పొకలగూడెం, రావికంపాడు గ్రామాల్లో మంత్రి విస్తృతంగా పర్యటించారు.

పూరి గుడిసెలు లేని తెలంగాణగా తీర్చిదిద్దుతాం...

​పొకలగూడెం వేదికగా జరిగిన సభలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఒక్క పేద కుటుంబం కూడా పూరి గుడిసెలో నివసించకూడదనే ధ్యేయంతో ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా రెండు విడతల్లో మొత్తం 7 లక్షల ఇందిరమ్మ గృహాల నిర్మాణాన్ని చేపట్టామని, ఒక్క రాజధాని హైదరాబాద్‌లోనే ప్రత్యేకంగా లక్ష ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. గత ప్రభుత్వం రూ.8.21 లక్షల కోట్ల అప్పుల భారం నెత్తిపై పెట్టినప్పటికీ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు.ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే ఏకంగా 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, ఇటీవలే మరో 16 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులకు భరోసా కల్పించామన్నారు. మహిళల ఆర్థిక సాధికారత కోసం రూ.70 వేల కోట్ల వడ్డీలేని రుణాలను అందించామన్నారు. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, అర్హులకు కొత్త రేషన్ కార్డులతో పాటు నాణ్యమైన సన్నబియ్యాన్ని అందిస్తూ పేదల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని వివరించారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన...

​మండలంలోని మంగయ్యబంజార గ్రామంలో రూ.45 లక్షలతో చేపట్టే గ్రావెల్ రోడ్డు, కల్వర్టు, సీసీ రోడ్డు, రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి కొత్తగా 24 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం పొకలగూడెంలో రూ.60 లక్షల వ్యయంతో నాలుగు అంతర్గత సీసీ రోడ్ల పనులను ప్రారంభించి, ఈ గ్రామానికి ఇప్పటికే 77 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని తెలిపారు. రావికంపాడులో రూ.20 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్ల పనులకు భూమిపూజ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, మిగిలిన అంతర్గత రహదారులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, కొత్తగూడెం ఆర్డీవో మధు, చండ్రుగొండ తహసిల్దార్ జగదీశ్వర ప్రసాద్, డీపీఓ అనూష, గృహనిర్మాణ శాఖ పీడీతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది