ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమానికి సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్ : ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వం తరపున మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఇంటి పట్టాల పంపిణీ చర్చకు దారి తీసింది. కార్యక్రమానికి గ్రామ సర్పంచ్‌కు కనీస సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని నిరసిస్తూ గురువారం సీపీఐ(ఎం) గ్రామ శాఖ, గిరిజన సంఘం ఖమ్మం రూరల్ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట నేలపై కూర్చొని నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా పార్టీ మండల నాయకుడు పొన్నం వెంకటరమణ మాట్లాడుతూ... గిరిజన సర్పంచ్ ను కావాలనే ప్రోటోకాల్ పాటించకుండా అవమానించారని ఆరోపించారు. స్థానిక తహసీల్దార్, గ్రామ జీపీఓ అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సంబంధిత అధికారులపై ఉన్నతాధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యదర్శికి నిరసన పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాలోత్ హరి, రెండో వార్డు సభ్యుడు పొన్నం మురళి, ఐదో వార్డు సభ్యుడు ధర్మపురి నాగబ్రహ్మాచారి, పార్టీ నాయకులు ఏలూరి నాగేశ్వరరావు, మేడెబోయిన రామనాదం, అద్దంకి ఉపేందర్ రావు, జిల్లెల్ల వెంకటేశ్వర్లు, షేక్ నవాబ్ సాహెబ్, బెడదం బాబు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి