ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

రైతులు పట్ల బ్యాంకర్ల తీరు అమానుషం

ప్రకృతి కరుణించదు... బ్యాంకర్లు కనికరించరు!

ఒకవైపు ఎల్‌నినో ఎఫెక్ట్... మరోవైపు బ్యాంకర్ల కొత్త నిబంధనలు

ఇతర బ్యాంకుల రుణాలు తీర్చితేనే పంట రుణాల రెన్యువల్ అంటూ రైతులపై ఆర్థిక భారం

ఏఐకేఎస్ మండల అధ్యక్ష కార్యదర్శులు కొంగర భాస్కరరావు, ఏలూరి పూర్ణచంద్రరావు

ప్రజాపక్షం/బోనకల్: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని పంటల భవిష్యత్తు అనిశ్చితిలో పడగా, పంట రుణాల రెన్యువల్‌కు బ్యాంకులు విధిస్తున్న కొత్త నిబంధనలు రైతులను మరింత ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నాయని ఏఐకేఎస్ మండల అధ్యక్షుడు కొంగర భాస్కరరావు, కార్యదర్శి ఏలూరి పూర్ణచంద్రరావు ఆరోపించారు. ఇతర బ్యాంకుల్లోని అసలు రుణాలను పూర్తిగా చెల్లిస్తేనే పంట రుణాలను పునరుద్ధరిస్తామని బ్యాంకులు షరతులు విధించడం అన్యాయమని వారు డిమాండ్ చేశారు. సోమవారం బోనకల్ మండలంలోని తూము ప్రకాశ్‌రావు భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ఒకవైపు ప్రకృతి రైతును కరుణించక పంటలు దెబ్బతింటుంటే, మరోవైపు రైతుకు అండగా నిలవాల్సిన బ్యాంకులు కొత్త నిబంధనల పేరుతో మరింత భారాన్ని మోపుతున్నాయని విమర్శించారు. రైతు సంక్షేమం గురించి ప్రభుత్వాలు గొప్పలు చెబుతున్నప్పటికీ, బ్యాంకుల వద్ద మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. మండలంలోని డీసీసీబీ, తెలంగాణ గ్రామీణ బ్యాంకు, ఎస్‌బీఐతో పాటు ఇతర బ్యాంకుల్లో పంట రుణాల రెన్యువల్ కోసం వెళ్లిన రైతులకు ఊహించని షరతులు ఎదురవుతున్నాయని తెలిపారు. గతంలో కేవలం వడ్డీ చెల్లిస్తే రుణాలను పునరుద్ధరించేవారని, ప్రస్తుతం ఇతర బ్యాంకుల్లో ఉన్న అసలు రుణాలను పూర్తిగా చెల్లించిన తర్వాతే పంట రుణాలను రెన్యువల్ చేస్తామని అధికారులు చెబుతున్నారని ఆరోపించారు. దీంతో సాగుకు అవసరమైన పెట్టుబడి కోసం బ్యాంకులపై ఆధారపడే చిన్న, సన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఇప్పటికే పంట నష్టాలతో ఆదాయం లేక సతమతమవుతున్న రైతులు లక్షల రూపాయల అసలు రుణాన్ని ఒకేసారి ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. పంట రుణాల పునరుద్ధరణ నిలిచిపోవడంతో ఖరీఫ్ సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొనుగోలుకు రైతులు అధిక వడ్డీకి ప్రైవేట్ అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రైతులను మరింత అప్పుల ఊబిలోకి నెట్టే ప్రమాదకర పరిణామమని హెచ్చరించారు. ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తామని ప్రకటిస్తుంటే, బ్యాంకులు మాత్రం కఠిన నిబంధనలతో రైతులను ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాదన్నారు. రైతుల వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గతంలో అమలులో ఉన్న విధంగానే పంట రుణాలను వెంటనే రెన్యువల్ చేయాలని, ఇతర బ్యాంకుల రుణాలను సాకుగా చూపి పంట రుణాలను నిలిపివేయవద్దని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ప్రభుత్వం, బ్యాంకుల ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని రైతులకు న్యాయం చేయాలని, లేకుంటే రైతు సంఘాల ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم