ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

అధికార పార్టీ అండతో దౌర్జన్యం...


 అధికార పార్టీ అండతో పెట్రేగిపోతున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్

తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలేబోయిన వెంకటనారాయణ

ప్రజాపక్షం/కరకగూడెం :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో అధికార పార్టీ అండదండలతో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు, అక్రమ రవాణా కొనసాగించడాన్ని తుడుందెబ్బ నాయకులు తీవ్రగా వ్యతిరేకిస్తున్నారు. షెడ్యూల్డ్ ఏరియాల్లో రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక హక్కులు, పేసా చట్టం, 1/70 భూ బదలాయింపు నియంత్రణ నిబంధనలు అమలులో ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు వాటిని పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఏజెన్సీ ప్రాంతంలో పేసా గ్రామసభ అనుమతి లేకుండా సహజ వనరుల దోపిడీ జరుగుతుంటే అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. గిరిజనుల హక్కులను కాపాడాల్సిన అధికార యంత్రాంగం కొంతమంది గిరిజనేతరుల ప్రభావానికి లోనై విధులు నిర్వర్తిస్తోందనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని తెలిపారు.అక్రమ ఇసుక రవాణాను ప్రశ్నించిన ఆదివాసీ నాయకులను బెదిరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని తుడుందెబ్బ తీవ్రంగా ఖండించింది. ప్రజా సమస్యలను ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని, బెదిరింపులతో ఆదివాసీ నాయకుల గొంతు నొక్కే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించింది.ఇసుక రవాణా పేరుతో ఒక్కో ట్రిప్పుకు రూ.2,000 నుండి రూ.5,000 వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని, దీనివల్ల సాధారణ ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడటమే కాకుండా ప్రభుత్వ ఆదాయానికీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై స్వతంత్రంగా, పారదర్శకంగా విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని డిమాండ్ చేశారు. ఎటువంటి పేసా గ్రామసభ అనుమతి లేకుండా ఇసుక ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శి అనుమతి లేదు కాను వేరే పంచాయతీ కార్యదర్శి ఎలా అనుమతులు ఇస్తారు? అసలు ఇసుక తొలకాలకు పంచాయతీ కార్యదర్శిలకు అధికారం ఎవరిచ్చారు.? అలాగే అధిక లోడుతో, రహదారులపై ప్రయాణించే ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ప్రమాదాలు జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు. ఏజెన్సీ చట్టాలు కాపాడాల్సిన అధికారులు గిరిజనేతరుల చేతుల్లోకి వెళ్లి ఆదివాసీ చట్టలకు తూట్లు పొడుస్తున్నారని ఈ సందర్బంగా పోలేబోయిన వెంకటనారాయణ విమర్శించారు. ఇకనైనా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, గనుల శాఖ, రెవెన్యూ, పోలీసు శాఖలు వెంటనే జోక్యం చేసుకుని అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తుడుందెబ్బ డిమాండ్ చేసింది. ఏజెన్సీ ప్రాంతంలో పేసా చట్టం, గిరిజన హక్కుల చట్టాలు, 1/70 చట్టాన్ని కచ్చితంగా అమలు చేసి ఆదివాసీల హక్కులను పరిరక్షించాలని ఈ సందర్బంగా హెచ్చరించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది