దాత ఇచ్చిన ఆవు మిస్టరీ తేలకుండానే కొత్త నియామకమా..?
శివాలయ ఆదాయాన్ని పెంచిన వారిని విస్మరిస్తున్నారా..?
లోటు లెక్కలు చూపిన వారికే మళ్లీ పెద్దపీట వేస్తున్నారా..?
దాతల విశ్వాసాన్ని కాపాడే బాధ్యత ఎవరిది..?
ఆలయ పరిరక్షణకు ప్రమాణమా..? రాజకీయ ప్రాధాన్యమా..?
ప్రజాపక్షం కూసుమంచి :కూసుమంచి శివాలయ చైర్మన్ నియామకం మరోసారి చర్చనీయాంశంగా మారుతోంది. ఆలయ అభివృద్ధి, ఆదాయ వృద్ధి, దాతల విశ్వాసం, గత పాలక మండళ్ల పనితీరు వంటి అంశాలను పక్కనపెట్టి కేవలం ఇతర ప్రమాణాల ఆధారంగా నియామకం జరుగుతుందా అనే సందేహాలు భక్తుల్లో వ్యక్తమవుతున్నాయి.గతంలో ఆలయ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన కొందరు నాయకులు కూసుమంచి శివాలయానికి లక్షల రూపాయల ఆదాయాన్ని సమకూర్చారని, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని స్థానికులు గుర్తుచేస్తున్నారు. అలాంటి వారి సేవలను పరిగణనలోకి తీసుకుంటున్నారా లేదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.ఇక శివాలయానికి ఓ దాత భక్తిశ్రద్ధలతో అందించిన ఆవు వ్యవహారం ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయిందని భక్తులు చెబుతున్నారు. ఆ ఆవును అర్ధరాత్రి సమయంలో తరలించారని అప్పట్లో వచ్చిన ఆరోపణలపై ఇప్పటివరకు స్పష్టత రాలేదని అంటున్నారు. ఆవు ఎక్కడ ఉంది..? దాని నిర్వహణ ఎలా జరిగింది..? బాధ్యులు ఎవరు..? వంటి ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారు.ఆలయ ఆస్తులు, దాతల విరాళాలు, గోసంరక్షణ వంటి అంశాలపై స్పష్టత లేకుండానే కొత్త చైర్మన్ నియామకం చేపడితే ప్రజల్లో మరిన్ని సందేహాలు తలెత్తే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు."అడిగేవారు చరిత్రను మరిచిపోవచ్చు.. కానీ ఇచ్చే వారు, సేవ చేసిన వారు, ప్రజలు మాత్రం చరిత్రను గుర్తుంచుకుంటారు" అనే వ్యాఖ్యలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఆలయ అభివృద్ధికి కృషి చేసిన వారిని గుర్తించడం ఎంత ముఖ్యమో, వివాదాస్పద అంశాలపై సమాధానాలు ఇవ్వడం కూడా అంతే ముఖ్యమని భక్తులు సూచిస్తున్నారు.కాబట్టి చైర్మన్ ఎంపికలో వ్యక్తిగత, రాజకీయ లేదా వర్గపరమైన అంశాల కంటే ఆలయ అభివృద్ధి, పారదర్శకత, సేవా చరిత్ర, ప్రజల విశ్వాసం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని భక్తులు కోరుతున్నారు. కూసుమంచి శివాలయ భవిష్యత్తు కోసం తీసుకునే నిర్ణయం ప్రజల విశ్వాసాన్ని పెంచేదిగా ఉంటుందా..? లేక మరిన్ని ప్రశ్నలకు తావిస్తుందా..? అన్నది వేచి చూడాల్సి ఉంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి