ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

వ్యవసాయానికి పరిశ్రమల తోడ్పాటుతోనే రైతుల ఆదాయం పెరుగుతుంది... డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు



ఖమ్మంలో మరిన్ని అగ్రో ఆధారిత పరిశ్రమలకు ప్రభుత్వం ప్రోత్సాహం

విలువ ఆధారిత వ్యవసాయంతో రైతులు ఆర్థికంగా బలోపేతం కావాలి

కొణిజెర్లను పారిశ్రామిక మండలంగా తీర్చిదిద్దుతాం


రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు 10 లక్షల ఎకరాలకు విస్తరణే లక్ష్యం

దేశంలో తొలి సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్

ప్రతి 10 వేల ఎకరాలకు ఒక ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు లక్ష్యం

సీడ్ గార్డెన్‌తో దేశానికే ఖమ్మం కేంద్రంగా మారుతుంది

గోద్రెజ్ సమీకృత (ఇంటిగ్రేటెడ్) ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని ప్రారంభించిన డిప్యూటీ సీఎం

ప్రజా పక్షం /కొనిజర్ల : వ్యవసాయాన్ని పరిశ్రమలతో అనుసంధానం చేసి విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించినప్పుడే రైతుల ఆదాయం స్థిరంగా పెరుగుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలం అంజనాపురంలో తెలంగాణ ప్రభుత్వ సహకారంతో నిర్మించిన గోద్రెజ్ సమీకృత (ఇంటిగ్రేటెడ్) ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క మల్లు, రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, గోద్రెజ్ ఇండస్ట్రీస్ చైర్‌పర్సన్ నాదిర్ బి. గోద్రెజ్, గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ కటారియా, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్ర మోహన్, జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, సిపి సునీల్ దత్, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ లతో కలిసి సోమవారం ఘనంగా ప్రారంభించారు.అనంతరం ఫ్యాక్టరీలోని ఉత్పత్తి విభాగాలు, ఆయిల్ పామ్ గెలల ప్రాసెసింగ్ యూనిట్లు, నాణ్యత నియంత్రణ వ్యవస్థను పరిశీలించి సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో *డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ* ఖమ్మం జిల్లా వ్యవసాయానికి చిరునామాగా నిలిచిందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకప్పుడు హెవీ వాటర్ ప్లాంట్, థర్మల్ పవర్ స్టేషన్, నవభారత్ వంటి పరిశ్రమలు ఉండేవని, జిల్లా పునర్విభజన తర్వాత ప్రస్తుతం ఖమ్మం జిల్లా ప్రధానంగా వ్యవసాయంపైనే ఆధారపడుతోందన్నారు. పాలేరు జలాశయం, నాగార్జునసాగర్ ఎడమ కాలువ, వైరా రిజర్వాయర్ ఈ ప్రాంత రైతాంగానికి జీవనాధారమని పేర్కొన్నారు.రైతుల ఆదాయం పెరగాలంటే సంప్రదాయ పంటలతో పాటు ఆయిల్ పామ్ వంటి అధిక ఆదాయం ఇచ్చే వాణిజ్య పంటల సాగు వైపు మళ్లడం అవసరమన్నారు. ఈ అంశాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సమగ్రంగా వివరించారని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు చేపట్టే రైతులకు నాలుగు సంవత్సరాల కాలంలో ఎకరాకు సుమారు రూ. 52 వేల వరకు ప్రోత్సాహకాన్ని అందిస్తోందని తెలిపారు. సూపర్ ఎల్‌నినో వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఆయిల్ పామ్ సాగు నిలకడైన దిగుబడిని అందిస్తుందని చెప్పారు.దేశంలో వంటనూనెల అవసరం ఎక్కువగా ఉన్నదని, దేశీయ ఉత్పత్తి 12 మిలియన్ టన్నులకు మాత్రమే పరిమితమైందన్నారు. ప్రతి సంవత్సరం సుమారు 3 మిలియన్ టన్నుల వంటనూనె దిగుమతుల కోసం రూ.1.5 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం వెచ్చించాల్సి వస్తోందని తెలిపారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ఆయిల్ పామ్ సాగు విస్తరణ అత్యంత అవసరమని స్పష్టం చేశారు.1991-92లో అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి హయాంలో ఈ ప్రాంతంలో ఆయిల్ పామ్ సాగుకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సుమారు 15 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతోందని, దేశ అవసరాలకు అనుగుణంగా దానిని 70 లక్షల ఎకరాలకు విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. 2023లో టన్ను ఆయిల్ పామ్ గెలల ధర రూ.12 వేలుగా ఉండగా ప్రస్తుతం సుమారు రూ.23 వేలకు చేరడం రైతులకు ప్రయోజనకరంగా మారిందన్నారు. వంట నూనెతో పాటు సౌందర్య సాధనాల పరిశ్రమలకు అవసరమైన ముడి పదార్థాలను కూడా ఆయిల్ పామ్ ద్వారా అందించవచ్చని తెలిపారు.ఖమ్మం జిల్లాలో ఈ సమీకృత పరిశ్రమ ఏర్పాటవడం రైతులకు, యువతకు వరంగా నిలుస్తుందని పేర్కొంటూ, ఈ పరిశ్రమ ఏర్పాటుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిరంతరం కృషి చేశారని ప్రత్యేకంగా అభినందించారు. గోద్రెజ్ యాజమాన్యం, స్థానిక ఎమ్మెల్యే రాందాస్ నాయక్, అధికారులు అందరికీ అభినందనలు తెలిపారు.ఈ పరిశ్రమకు అవసరమైన రహదారి మౌళిక సదుపాయాలను టీజీఐఐసీ ద్వారా త్వరలోనే కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో మరిన్ని వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పడి రైతులు పండించే పంటలకు స్థానికంగానే విలువ ఆధారిత ఉత్పత్తులు తయారయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆకాంక్షించారు. దీని వల్ల రైతుల ఆదాయం పెరగడంతో పాటు స్థానిక యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు.ఈ సమీకృత ప్రాజెక్టులో సీడ్ గార్డెన్, మిల్లింగ్ యూనిట్, రిఫైనరీ వంటి అన్ని సౌకర్యాలు ఒకే ప్రాంగణంలో ఏర్పాటు కావడం విశేషమన్నారు. భవిష్యత్తులో ఆయిల్ పామ్ విత్తనాల కోసం ఇండోనేషియా, మలేషియా వంటి దేశాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదన్నారు. 113 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ సమీకృత పరిశ్రమ గంటకు 60 నుంచి 120 టన్నుల గెలలను ప్రాసెస్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉందని తెలిపారు. గోద్రెజ్ సంస్థ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని, మిర్చి, పత్తి, వరి ఆధారిత పరిశ్రమలను కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని సంస్థను కోరారు.రైతులు వాణిజ్య పంటలు, విలువ ఆధారిత వ్యవసాయంపై దృష్టి సారించాలని పిలుపు నిచ్చారు. రాష్ట్ర స్థూల ఆర్థికోత్పత్తి (GSDP) సుమారు రూ.17 లక్షల కోట్లు ఉండగా, వ్యవసాయ రంగం వాటా కేవలం 15 శాతం మాత్రమే ఉండటం రైతుల ఆర్థిక పరిస్థితిని సూచిస్తోందన్నారు. రైతుల ఆదాయం పెరగాలంటే వాణిజ్య పంటలు, విలువ ఆధారిత పరిశ్రమలే శాశ్వత పరిష్కారమని పేర్కొన్నారు.ఇటీవల తొమ్మిది రోజుల్లో రైతుల ఖాతాల్లో రూ.9 వేల కోట్ల పెట్టుబడి సాయం జమ చేశామని తెలిపారు. నాగార్జునసాగర్, కృష్ణా జలాలు, సీతారామ ఎత్తిపోతల పథకం, పాలేరు లింక్, ఎన్కూరు–రాజీవ్ లింక్ కాలువల ద్వారా లభించే నీటిని వినియోగించుకొని ఖమ్మం జిల్లాలో ఉద్యాన పంటల సాగును మరింత విస్తరించాలని సూచించారు.కొణిజెర్ల మండలం భవిష్యత్తులో రాష్ట్రం లోనే ప్రముఖ పారిశ్రామిక మండలంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న సీడ్ గార్డెన్ ద్వారా దేశవ్యాప్తంగా రైతులకు నాణ్యమైన ఆయిల్ పామ్ విత్తనాలు అందించే స్థాయికి ఈ కేంద్రం ఎదగాలని అన్నారు. సూపర్ ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ పంటలపై ప్రతి గ్రామంలో రైతులతో చర్చలు నిర్వహించి అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు.మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ* గత మూడు దశాబ్దాలుగా గోద్రెజ్ సంస్థ ఆయిల్ పామ్ గెలల కొనుగోలు లో రైతులకు భాగస్వామిగా నిలుస్తోందని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో ఆయిల్ పామ్ ఆధారిత పరిశ్రమలను అభివృద్ధి చేసే అవకాశాలు మరింత విస్తరించాయని, దేశంలోనే ఆయిల్ పామ్ హబ్‌గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.ఒకప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాకే పరిమితమైన ఆయిల్ పామ్ సాగు, నేడు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరించిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 3 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతోందని, రానున్న 2 నుంచి 3 సంవత్సరాల్లో దానిని 10 లక్షల ఎకరాలకు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.దేశం వంటనూనెల్లో స్వయం సమృద్ధి సాధించాలంటే సుమారు 70 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు అవసరమని చెప్పారు. ప్రస్తుతం దేశంలోని ఆయిల్ పామ్ సాగులో దాదాపు 90 శాతం తెలుగు రాష్ట్రాల నుంచే జరుగుతోందన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు మూడు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలు పనిచేస్తుండగా, గోద్రెజ్ ఏర్పాటు చేసిన ఈ పరిశ్రమ నాలుగో ఫ్యాక్టరీ అని తెలిపారు.దేశంలో ఇప్పటి వరకు ఆయిల్ పామ్‌కు ప్రత్యేక సీడ్ గార్డెన్ లేకపోవడం గమనార్హమని, గోద్రెజ్ సంస్థ మలేషియా భాగస్వామ్యంతో ఖమ్మంలో దేశంలోనే తొలి ఆధునిక సీడ్ గార్డెన్‌ను ఏర్పాటు చేస్తోందని చెప్పారు. సీడ్ గార్డెన్‌తో పాటు పరిశోధన కేంద్రం, రైతులకు అవగాహన కల్పించే ప్రదర్శన విభాగాలు, శిక్షణా కార్యక్రమాలు, నాణ్యమైన నర్సరీల ఏర్పాటు వంటి కార్యక్రమాలకు కూడా నేటి నుంచే శ్రీకారం చుడుతున్నామని తెలిపారు.ఈ సమీకృత ఆయిల్ పామ్ కేంద్రం రైతులకు అన్ని విధాలా ఉపయోగపడు తుందని మంత్రి పేర్కొన్నారు. రైతుల సందేహాల నివృత్తి, శాస్త్రీయ సాగుపై మార్గదర్శకాలు, నాణ్యమైన మొక్కలు, వ్యవసాయ పరికరాలు, ఎరువులు, పురుగు మందులు, అవసరమైన సాంకేతిక సేవలు ఒకే కేంద్రంలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. రైతులు శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపడితే ఎకరాకు 15 నుంచి 16 టన్నుల వరకు ఆయిల్ పామ్ గెలల దిగుబడి సాధించవచ్చని చెప్పారు. రాష్ట్రంలో త్వరలోనే మరో ఆరు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.ప్రస్తుతం నెలకొన్న సూపర్ ఎల్‌నినో పరిస్థితుల్లో పంటల వైవిధ్యీకరణ అత్యంత అవసరమని పేర్కొన్నారు. పసిఫిక్ మహా సముద్రంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల దక్షిణ భారతదేశంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో ఆయిల్ పామ్, ఉద్యాన పంటలు రైతులకు స్థిరమైన ఆదాయాన్ని అందించే ఉత్తమ ప్రత్యామ్నాయమని వివరించారు.ఆయిల్ పామ్ రైతులు ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నారని, ఆయిల్ పామ్ సాగు చేస్తున్న అనేక మంది రైతుల కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడి, వారిపిల్లలు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే స్థాయికి ఎదిగారని అన్నారు. ఇతర ఏ పంటతోనూ పోల్చలేనంత ఆదాయం ఆయిల్ పామ్ ద్వారా లభిస్తుందని పేర్కొన్నారు. తాను కూడా ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతునేనని గుర్తు చేశారు.వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను ప్రోత్సహించడం రాష్ట్ర ప్రభుత్వ విధానమని తెలిపారు. ఏ జిల్లాలోనైనా 10 వేల ఎకరాలకు పైగా ఆయిల్ పామ్ సాగు ఉంటే అక్కడే ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను పెంచాలని, అలాగే దిగుమతులపై సుంకాలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోందన్నారు.ఆయిల్ పామ్ తోటల్లో కంది, పత్తి, పప్పు ధాన్యాలు వంటి అంతర పంటలను విజయవంతంగా సాగు చేయవచ్చని చెప్పారు. తద్వారా రైతులకు ప్రారంభ సంవత్సరాల్లోనే అదనపు ఆదాయం లభిస్తుందని వివరించారు. ఖమ్మం జిల్లా దేశానికే స్ఫూర్తిగా నిలుస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి పరిశ్రమల ఏర్పాటు ద్వారా రైతులకు మెరుగైన ఆదాయం, యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. గోద్రెజ్ సంస్థ మరో పరిశ్రమను కూడా ఖమ్మంలో ఏర్పాటు చేయాలనుకుంటే అవసరమైన భూమిని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఆయిల్ పామ్ సాగు విస్తరణతో పాటు వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధే తెలంగాణ రైతుల ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తుందని, ఖమ్మం జిల్లా దేశంలోనే ఆయిల్ పామ్ రంగానికి ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేశారు.వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్ర మోహన్ మాట్లాడుతూ*..., రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్‌లో తెలంగాణ రైజింగ్–2047 విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేసిందని తెలిపారు. ఆ విజన్‌కు అనుగుణంగా వ్యవసాయ రంగ అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ రూపొందించామని, ప్రస్తుతం సుమారు 40 బిలియన్ డాలర్లుగా ఉన్న వ్యవసాయ రంగ ఆర్థిక విలువను 2047 నాటికి 400 బిలియన్ డాలర్లకు పెంచడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.రాష్ట్రంలో ప్రస్తుతం 3.36 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతోందని, గత మూడు సంవత్సరాల్లోనే 2 లక్షల ఎకరాల కొత్త విస్తీర్ణం ఆయిల్ పామ్ సాగులోకి రావడం దేశంలోనే అత్యధికమని తెలిపారు. గోద్రెజ్ సంస్థకు ఖమ్మం జిల్లాలో 113ఎకరాల భూమిని కేటాయించి, అవసరమైన అన్ని అనుమతులను వేగవంతంగా మంజూరు చేయడం ద్వారా, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో దేశంలోనే తొలి సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేయడం సాధ్యమైందన్నారు.  

గోద్రెజ్ ఇండస్ట్రీస్ చైర్మెన్ నాదిర్ బి. గోద్రెజ్ మాట్లాడుతూ* ఆయిల్ పామ్ సాగు అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. దేశం వంటనూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడం జాతీయ లక్ష్యమని, ఆ లక్ష్య సాధనలో తెలంగాణ ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోందన్నారు.ఆయిల్ పామ్ సాగు విస్తరణలో మహిళలు మరింత చురుకుగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రైతు కుటుంబాల్లో మహిళల భాగస్వామ్యం పెరిగితే ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం మరింత పెరిగి, దేశం వంటనూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే లక్ష్యం వేగంగా నెరవేరుతుందని పేర్కొన్నారు.గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ కటారియా మాట్లాడుతూ* గత మూడు దశాబ్దాలుగా గోద్రెజ్ సంస్థ దేశ వ్యాప్తంగా ఆయిల్ పామ్ రంగంలో పని చేస్తోందన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేల హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తూ, దేశంలోని ప్రముఖ ఆయిల్ పామ్ సంస్థల్లో ఒకటిగా గోద్రెజ్ ఎదిగిందని తెలిపారు. భారత్ ఇప్పటికీ వంటనూనెల అవసరాల కోసం విదేశీ దిగుమతులపై ఆధారపడుతోందని, దేశీయ ఉత్పత్తిని పెంచేందుకు ఆయిల్ పామ్ సాగు విస్తరణ అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఈ దిశగా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే వేగంగా ఎదుగుతున్న రాష్ట్రంగా నిలిచిందని కొనియాడారు.తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఖమ్మం జిల్లాలో తొలి సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇదే ప్రాంగణంలో త్వరలోనే ఎడిబుల్ ఆయిల్ రిఫైనరీని కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సమీకృత ప్రాజెక్టు ద్వారా 700 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు.నాణ్యమైన ఆయిల్ పామ్ మొక్కల ఉత్పత్తి కోసం ఖమ్మంలోనే సీడ్ గార్డెన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రైతులకు మెరుగైన నాణ్యత గల నాట్లను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఆయిల్ పామ్ సాగు మరింత విస్తరించేందుకు సంస్థ కృషి చేస్తుందని చెప్పారు.

వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ* అంజనాపురంలో సమీకృత ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు నాయకత్వంలో రైతులు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. గత 30 సంవత్సరా లుగా ఈ ప్రాంతంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని రైతులు కోరుకుంటూ వచ్చారని తెలిపారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ప్రారంభమై, నేడు పూర్తై ప్రారంభోత్సవం జరగడం ఈ ప్రాంత ప్రజల కల సాకారమైన రోజుగా అభివర్ణించారు.గోద్రెజ్ సంస్థ ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఫ్యాక్టరీలో ఉద్యోగాల భర్తీలో స్థానిక యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ ప్రాంత యువత ప్రతిభావంతులు, నైపుణ్యం కలిగిన వారని, వారికి ఎక్కువగా ఉపాధి అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా, సుడా చైర్‌పర్సన్ దుర్గా ప్రసాద్ , రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, వైరా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, సర్పంచ్ లు, గోద్రెజ్ సంస్థ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆయిల్ పామ్ రైతులు, పెద్ద సంఖ్యలో ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది