ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఫలితాన్నిచ్చిన ప్రజల పోరాటం


 


ఎదులాపురం గ్రామంలో స్మశాన భూమి పరిరక్షణకు బలమిచ్చిన ఐక్యత 

ఆక్రమణ యత్నాలను అడ్డుకున్న గ్రామస్థులు

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్ : ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురం గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నెం.142లో ఉన్న సుమారు 60 కుంటల భూమి గత 70 సంవత్సరాలుగా సుమారు 2,500 మంది ప్రజలకు సాంప్రదాయ దహన సంస్కారాల స్థలంగా ఉపయోగంలో ఉంది. చిన్నతండా, తాళ్లేసే తండా, సత్యనారాయణపురం (కొత్తూరు), జంగాల కాలనీ తదితర ప్రాంతాల ప్రజలు ఈ స్మశాన వాటికను ప్రధానంగా వినియోగిస్తూ వస్తున్నారు.గ్రామ పునర్విభజన నేపథ్యంలో కొన్ని ప్రాంతాలు కొత్త పంచాయతీలుగా విడిపోయినప్పటికీ, ఈ స్మశాన భూమి వినియోగం కొనసాగుతూ వచ్చింది. అయితే గతంలో సమీపంలోని పాత స్మశాన భూమి కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లి అక్కడ నిర్మాణాలు జరగడంతో, దహన సంస్కారాలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ అంశంపై న్యాయపరమైన వివాదాలు కూడా కొనసాగినట్లు సమాచారం.ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకుని కొందరు వ్యక్తులు సర్వే నెం.142లోని స్మశాన భూమిపై హక్కులు ఉన్నట్లు పేర్కొంటూ ఆక్రమణకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా చుట్టుపక్కల కాంపౌండ్ నిర్మించేందుకు కూడా ప్రయత్నాలు జరిగినట్లు తెలుస్తోంది.విషయం తెలుసుకున్న చిన్నతండా, తాళ్లేసే తండా, సత్యనారాయణపురం, జంగాల కాలనీ గ్రామాల ప్రజలు ఒక్కటై అక్కడికి చేరుకుని ఆక్రమణ ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకించారు. గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు కలిసి సంఘటితంగా నిలబడి ఈ ప్రయత్నాలను అడ్డుకున్నారు.అయితే వివాదం ఇక్కడితో ముగియలేదు. స్మశాన భూమి ఎదురుగా నాలుగు ప్లాట్లకు పట్టాలు పొందినట్లు చూపిస్తూ కొందరు వ్యక్తులు మొత్తం భూమి తమదేనని ప్రచారం చేసినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. దీనిపై గ్రామ ప్రజలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో గ్రామ పెద్దలు సహా 12 మంది నాయకులపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు సమాచారం.కేసులు కొనసాగుతున్నప్పటికీ గ్రామస్థులు వెనుకడుగు వేయకుండా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి స్మశాన వాటిక పరిరక్షణ కోసం నిరంతర పోరాటం కొనసాగించారు. చివరికి ప్రజల ఐక్యతతో భూమిని కాపాడుకోగలిగారుప్రస్తుతం ఈ స్మశాన వాటిక చుట్టూ ప్రహరీ గోడ, నీటి ట్యాంకు వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయబడినట్లు తెలుస్తోంది. దీంతో ఇది చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది.అయితే ప్రజా ప్రయోజనం కోసం పోరాడిన వారిపై నమోదైన కేసులను ప్రభుత్వం మానవతా దృక్పథంతో సమీక్షించి ఉపసంహరించుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే ఈ భూమిని శాశ్వత స్మశాన వాటికగా ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేసి మరింత అభివృద్ధి పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.సామాజిక ఐక్యతతో ప్రజలు తమ సంప్రదాయ స్థలాన్ని కాపాడుకున్న ఈ ఘటన, గ్రామ స్థాయిలో ప్రజా శక్తి ఎంత బలమైనదో మరోసారి నిరూపించింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది