సీఎంఆర్ఎఫ్ రూ.60 వేల చెక్కు లబ్ధిదారుడికి అందజేసిన 28వ వార్డు కౌన్సిలర్ దండి రంగారావు
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: అర్హులైన ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలను చేరవేయడంలో సిపిఐ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని 28వ వార్డు కౌన్సిలర్ దండి రంగారావు అన్నారు.మంగళవారం 28వ వార్డులోని చైతన్యనగర్‌కు చెందిన రేపాల సత్యనారాయణకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి మంజూరైన రూ.60 వేల విలువైన చెక్కును ఆయన ఇంటి వద్దకు వెళ్లి అందజేశారు.ఈ సందర్భంగా దండి రంగారావు మాట్లాడుతూ, పేదలు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా సిపిఐ పార్టీ నిరంతరం కృషి చేస్తోందన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ సహకారంతో, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సిఫారసు మేరకు ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరైందని తెలిపారు.ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ వాటి ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. సీఎం సహాయ నిధి చెక్కు అందడంతో లబ్ధిదారుడు రేపాల సత్యనారాయణ కుటుంబ సభ్యులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సిపిఐ నాయకులు దండి సురేష్, కౌన్సిలర్ దండి రంగారావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యుడు వెంపటి సురేందర్, చైతన్య నగర్ నివాసులు నాగేశ్వరరావు, బాబురావు, రంగారావు, రమేష్, రియాజ్, భార్గవ్, భద్రం తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి