కాల్వ కబ్జా ఆరోపణలు చేయలేదు.. అలైన్మెంట్ మార్పుపైనే ప్రశ్నించాం: సిపిఐ
రాజకీయ లబ్ధి కోసం సిపిఐ పాకులాడుతుందని నేను అనలేదు: శ్రీ సిటీ ఎండీ గరికపాటి వెంకట్రావు
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్:ఆటోనగర్ అభివృద్ధిలో సిపిఐ పాత్ర కీలకమని సిపిఐ మండల కార్యదర్శి పుచ్చకాయల సుధాకర్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ ఆటోనగర్‌కు సంబంధించి పత్రికలో వచ్చిన కథనంపై వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే సిపిఐ నాయకుల బృందం అక్కడికి వెళ్లి పరిశీలించిందన్నారు.తమ నాయకుడిపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని నిరూపించేందుకే అక్కడికి వెళ్లామని, అంతేకాని శ్రీ సిటీ ఎండీ గరికపాటి వెంకట్రావు కాల్వను కబ్జా చేశారని తాము ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. కేవలం కాల్వ అలైన్మెంట్ మార్పు అంశాన్ని మాత్రమే ప్రస్తావించామని తెలిపారు. అంతేకాకుండా ఆటోనగర్ అభివృద్ధిలో దివంగత సిపిఐ నేత- ప్రగతి కో ఆపరేటివ్ ఆటోనగర్ మాజీ ఉపాధ్యక్షుడు షాబాద్ నారాయణరెడ్డి పాత్ర కీలకమైనదిగా పేర్కొన్నారు. అలాగే ఆటోనగర్ ఏర్పాటుకు సిపిఐ సహకారం అందించడంతో పాటు ఇప్పుడు ఆటోనగర్ ఏర్పాటైన ప్రాంతం మొత్తం సిపిఐ పార్టీకి చెందిన రైతులవేనన్నారు.
సిపిఐ పై ఆరోపణలు చేయలేదు...
ఇదిలా ఉండగా, సిపిఐపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేసినట్లు ఓ పత్రికలో వచ్చిన కథనంపై శ్రీ సిటీ ఎండీ గరికపాటి వెంకట్రావు ప్రజాపక్షం వివరణ కోరగా స్పందించారు. ప్రస్తుతం తాను విజయవాడలో ఉన్నానని, గత వారం రోజులుగా అక్కడే ఉన్నట్లు తెలిపారు.తనకు ఓ వ్యక్తి విలేకరిగా పరిచయం చేసుకుని ఫోన్ చేసి సిపిఐ నాయకులు మీపై ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారని, అందుకు తాను కాల్వ అలైన్మెంట్ విషయం తనకు తెలియదని మాత్రమే సమాధానం ఇచ్చానని పేర్కొన్నారు."నేను ఎక్కడా సిపిఐ పార్టీపై రాజకీయ ఆరోపణలు చేయలేదు. సిపిఐ రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతుందని కూడా నేను అనలేదు. అలాంటి ప్రచారం పూర్తిగా అవాస్తవం" అని గరికపాటి వెంకట్రావు స్పష్టం చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి