ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

కల్లూరులో భారీ గంజాయి పట్టివేత.. ఐదుగురు అరెస్ట్



 రూ.11.55 లక్షల విలువైన 23.100 కిలోల గంజాయి, ఆటో, రెండు బైక్‌లు స్వాధీనం

ప్రజాపక్షం/కల్లూరు: ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణ శివారులో అక్రమంగా గంజాయి రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను కల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.11.55 లక్షల విలువైన 23.100 కిలోల ఎండు గంజాయి, ఒక ఆటోరిక్షా, రెండు ద్విచక్ర వాహనాలు, ఐదు మొబైల్ ఫోన్లు, రూ.5 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు కల్లూరు ఏసీపీ వసుందరా యాదవ్ తెలిపారు.పోలీసుల వివరాల ప్రకారం.. జూలై 22న కల్లూరు పట్టణంలో ఎస్సై హరిత సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా కాశ్మీర శివాలయం సమీపంలోని ఖాళీ ప్రాంగణంలో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను గుర్తించారు. పోలీసులను గమనించిన వెంటనే వారు పరారయ్యే ప్రయత్నం చేయగా, ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు ద్విచక్ర వాహనాలు వదిలేసి పరారయ్యారు. ఆటోలో తనిఖీ చేయగా 12 ప్యాకెట్లలో 23.100 కిలోల ఎండు గంజాయి లభ్యమైంది. అనంతరం తహశీల్దార్ సమక్షంలో పంచనామా నిర్వహించి గంజాయి, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.ప్రాథమిక విచారణలో ఒడిశాలోని మల్కనగిరి నుంచి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి, కల్లూరులో నిల్వ ఉంచి హైదరాబాద్‌కు చెందిన కొనుగోలుదారులకు విక్రయిస్తున్నట్లు నిందితులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.ఈ కేసును ఛేదించిన సత్తుపల్లి రూరల్ సీఐ ముత్తులింగయ్య, కల్లూరు ఎస్సై హరితతో పాటు పోలీసు సిబ్బందిని ఏసీపీ అభినందించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణా, విక్రయాలు, నిల్వ, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచి తగిన పారితోషికం అందజేస్తామని ఏసీపీ తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది